4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): నగరంలో వరుస బైక్ దొంగతనాల కేసులను త్రీటౌన్ పోలీసులు ఛేదించారు. ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. విశాఖపట్నానికి చెందిన ఇద్దరు యువకులు వ్యసనాలకు బానిసలై బైక్ దొంగతనాల బాట పట్టినట్టు పోలీసులు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల మేరకు నిందితులు ఖరీదైన రాయల్ ఎన్‌ఫీల్డ్ వాహనాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేస్తున్నట్టు తెలిపారు. వీరు దొంగిలించిన వాహనాలను ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నారు. ఇటీవల త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాల చోరీలు పెరగడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో వచ్చిన పక్కా సమాచారంతో త్రీ టౌన్ ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు నిఘా పెట్టి ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా బైక్ దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించినట్లు సమాచారం. నిందితుల నుంచి మూడు రాయల్ ఎన్‌ఫీల్డ్, ఒక జూక్ బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.


