డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శిగా శ్రీలక్ష్మి | - | Sakshi
Sakshi News home page

డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శిగా శ్రీలక్ష్మి

May 13 2026 12:20 AM | Updated on May 13 2026 12:20 AM

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా యార్లగడ్డ శ్రీలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు సేవలందించిన ఎన్‌.శ్రీలక్ష్మి స్థానంలో ఆమె వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మంగళవారం స్థానిక కోటగుమ్మంలో ఉన్న ప్రభుత్వ బాలుర పర్యవేక్షణ గృహాన్ని సందర్శించారు. అక్కడ వసతులను పరిశీలించారు. పర్యవేక్షణ గృహంలో బాలురతో మాట్లాడి వారి విద్యాభ్యాసం గురించి, యోగ క్షేమాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి మాట్లాడుతూ బాలురు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి విద్యపై దృష్టి సారించాలన్నారు. క్రమశిక్షణ, సహన శీలత ప్రతి వ్యక్తికి అవసరమైన ముఖ్యమైన లక్షణాలని, వాటిని అలవరచుకొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. ప్రతి ఒక్కరికీ ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు ఉందని, పర్యవేక్షణ గృహంలో ఏవైనా సమస్యలు ఉన్నా, న్యాయ సహాయం అవసరమైనా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలన్నారు.

ఏసీబీ వలలో మున్సిపల్‌ డీఈ

రూ.10 వేలు తీసుకుంటుండగా పట్టివేత

సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోట మున్సిపల్‌ డీఈ కె.శశిధర్‌ మంగళవారం ఏసీబీ వలకు చిక్కారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలిలా.. మున్సిపల్‌ కాంట్రాక్టర్‌ కనూరి పవన్‌కుమార్‌కు రూ.11 లక్షల విలువైన ఐదు బిల్లులు చేయడానికి డీఈ లంచం డిమాండ్‌ చేశారు. మొదటి విడతగా రూ.10 వేలు ఇచ్చేందుకు అంగీకరించిన పవన్‌కుమార్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు మంగళవారం రూ.10 వేలు ఇస్తుండగా మున్సిపల్‌ కార్యాలయంలో మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా డీఈని పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు ఇచ్చిన నోట్లు మున్సిపల్‌ డీఈ వద్ద ఉండడంతో ఏసీబీ డీఎస్పీ ఎం.కిశోర్‌కుమార్‌ ఆయనపై కేసు నమోదు చేశారు. మున్సిపల్‌ డీఈ తన అసిస్టెంట్‌ ఓదూరి శ్రీనివాసు ద్వారా రూ.10 వేలు తీసుకున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.

మార్పులకు గ్రీన్‌ సిగ్నల్‌

అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో కేంద్ర ప్రభుత్వ ‘పిలిగ్రిమేజ్‌ రీజువినేషన్‌ అండ్‌ స్ప్రిట్యువల్‌ ఆగ్‌మంటేషన్‌ డ్రైవ్‌ ’ (ప్రసాద్‌’) స్కీం నిధులు రూ.11 .50 కోట్ల వ్యయంతో కడుతున్న అన్నదాన భవనంలో మరింత ఎక్కువ మంది భోజనం చేసేందుకు వీలుగా నిర్మాణంలో మార్పులు చేయనున్నారు. మంగళవారం అన్నవరం దేవస్థానానికి వచ్చిన టూరిజం, దేవదాయశాఖ శాఖ అధికారులు ఈ నిర్మాణాన్ని పరిశీలించిన అనంతరం ఈ మేరకు నిర్ణయించారు. మూడంతస్తులలో అన్నదాన భవనం నిర్మిస్తున్నారు. మూడు అంతస్తులలోని నాలుగు హాల్స్‌లో ఒక్కో హాలులో 350 మంది చొప్పున 1,400 మంది భోజనం చేసేందుకు వీలుగా నిర్మాణం చేయాలని నిర్ణయించారు. అయితే ఈ భవనంలోని హాల్స్‌లో మెట్లు లోపల వైపు ఉండేలా ప్లాన్‌లో పొందుపరిచి ఆ మేరకు నిర్మిస్తున్నారు. గత నెలలో ఇక్కడికి వచ్చిన దేవదాయశాఖ కమిషనర్‌ కే రామచంద్రమోహన్‌ ఈ భవనాన్ని పరిశీలించి మెట్లు లోపల కాకుండా భవనం బయట వైపు వస్తే ఒక్కో హాలులో 50 నుంచి వంద మంది అదనంగా భోజనం చేసే వీలుంటుందని సూచించారు. భోజనం చేసిన భక్తులు వినాయక అతిథిగృహం వెనుక నుంచి వెలుపలకు వచ్చేలా మార్పులు చేయాలని ఆదేశించారు. దేవదాయశాఖ సలహాదారు సుబ్బారావు, చీఫ్‌ ఇంజినీర్‌ జీవీ శేఖర్‌, టూరిజం శాఖ ఎస్‌ఈ ఈశ్వరయ్య, ఈఈ విజయభాస్కరరెడ్డి, ఆర్కిటెక్ట్‌ బీకే సాధి, అన్నవరం దేవస్థానం ఈఓ నల్లం సూర్య చక్రధర్‌రావు, ఈఈ వీ రామకృష్ణ పరిశీలించారు. మెట్లు భవనం వెలుపల కడితే నాలుగు హాల్స్‌లో 50 నుంచి వంద మంది భోజనం చేసే వీలుంటుందని తేల్చారు. భవనం ఈ ఏడాది డిసెంబర్‌ కల్లా పూర్తి చేయాలని నిర్ణయించినట్లు ఈఈ రామకృష్ణ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement