నీట్ వంటి ప్రతిష్టాత్మక పరీక్షల్లో పేపర్ లీక్ ఆరోపణలు ఆందోళనకరం. లక్షలాది మంది విద్యార్థులు సంవత్సరాల పాటు కష్టపడి, ఒత్తిడిని ఎదుర్కొంటూ ఈ పరీక్షకు సిద్ధమవుతున్నారు. కొంతమంది చేసిన తప్పులకు నిజాయితీగా చదివిన విద్యార్థులు శిక్ష అనుభవించకూడదు. సమగ్రమైన దర్యాప్తు జరగాలి. అవినీతికి లేదా అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. నిజాయితీగా చదివిన విద్యార్థుల మానసిక స్థితి, భవిష్యత్తును కాపాడటం ముఖ్యం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, డిజిటల్ మానిటరింగ్ అమలు చేయాలి. వైద్య విద్యపై ప్రజల నమ్మకం నిలబెట్టడం అందరి బాధ్యత.
– డాక్టర్ ఎస్‌సీహెచ్‌ఎస్ రామకృష్ణ, కార్యదర్శి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్
రద్దు చేయడం దారుణం
నీట్ పరీక్షలు రద్దు చేయడం దారుణం. విద్యార్థులు మానసికంగా ఇబ్బంది పడతారు. ఎంతో కష్టపడి నీట్ రాసిన విద్యార్థులు మంచిర్యాంకులు వస్తాయని ఎదురు చూస్తున్నారు. ఎక్కడో రాజస్థాన్లో పేపర్ లీకేజ్ అయిందని పరీక్షలు రద్దు చేయడం సమంజసం కాదు. మా అబ్బాయి కోన సాయి సాత్విక్ నీట్ పరీక్షకు కష్టపడి చదివాడు. అలాగే రానున్న ఎంసెట్‌కు కూడా ప్రిపేర్ అవుతున్నాడు. ఈ సమయంలో పరీక్ష రద్దు ప్రభావం ఎంసెట్‌పై పడుతుంది. తిరిగి పరీక్షలు నిర్వహించడం, మళ్లీ చదివి రాయడం అంటే విద్యార్థికి ఇబ్బందిగా ఉంటుంది.
– కోన సత్యనారాయణ, కే.పెదపూడి,
అంబాజీపేట మండలం, కోనసీమ జిల్లా
కొత్త పరీక్షా తేదీలను ప్రకటించాలి
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు తమ భవిష్యత్తును ఈ పరీక్షలపై ఆధారపడి నిర్మించుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పరీక్షల పారదర్శకత, నిష్పాక్షికత, విశ్వసనీయతను కాపాడటం కేంద్ర పరీక్షా సంస్థల ప్రాథమిక బాధ్యత. ఆరోపణల నేపథ్యంలో పరీక్షలను రద్దు చేయడం విద్యార్థుల నమ్మకాన్ని నిలబెట్టే దిశగా తీసుకున్న అత్యవసర చర్యగా భావించాలి. అయితే, విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా, త్వరితగతిన కొత్త పరీక్షా తేదీలను ప్రకటించి, భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్టీఏకు విజ్ఞప్తి చేస్తున్నాం.
– మతుకుమిల్లి శ్రీవిజయ్
ధైర్యంగా ఉండాలి
నీట్ 2026 ఎన్నో నెలల కృషి, కష్టం. ఎంతోమంది విద్యార్థుల, తల్లిదండ్రుల కష్టం బూడిదలో పోసిన పన్నీరైంది. ఇది చాలా దారుణం, తిరిగి నీట్ ఎగ్జామ్ ఎప్పుడూ ప్రారంభమవుతుందో తెలిసే వరకు ఎవరూ భయపడకుండా ధైర్యంగా ఉండాలి.
– వై.గోవిందరాజు,
కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు, రాజమహేంద్రవరం


