ఐదేళ్ల లోపు పిల్లలకు బ్లూ ఆధార్‌ | - | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల లోపు పిల్లలకు బ్లూ ఆధార్‌

May 13 2026 12:20 AM | Updated on May 13 2026 12:20 AM

రాజమహేంద్రవరం రూరల్‌: ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి బ్లూ ఆధార్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖాధికారులకు కలెక్టర్‌ కీర్తి చేకూరి సూచించారు. మంగళవారం హుకుంపేటలోని మండల పరిషత్‌ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న ప్రత్యేక వేసవి శిబిరాలను, అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఈ వేసవి శిబిరంలో కొంతమంది పిల్లలకు ఆధార్‌ నంబర్లు లేవని కలెక్టర్‌ కీర్తి చేకూరి తెలుసుకున్నారు. బాల ఆధార్‌ నమోదు కోసం జనన ఽధ్రువీకరణ పత్రం, తల్లిదండ్రులలో ఒకరి ఆధార్‌ కార్డుతో సమీప ఆధార్‌ నమోదు కేంద్రాన్ని సంప్రదించాలని తెలిపారు. ఐదేళ్లలోపు పిల్లలకు వేలిముద్రలు, ఐరిస్‌ స్కాన్‌ అవసరం లేకుండా ఫొటోతోనే నమోదు ప్రక్రియ పూర్తి చేస్తారని వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ కీర్తి విద్యార్థులకు డిక్టేషన్‌ చెప్పి రాయించారు. 3, 4 తరగతుల విద్యార్థుల్లో పఠన సామర్థ్యం లోపిస్తున్నట్లు గుర్తించి, అలాంటి వారికి ప్రత్యేక వేసవి శిబిరాల ద్వారా అదనపు బోధన నిర్వహించాలని సూచించారు. రిజిస్టర్‌ అయిన పిల్లల్లో ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. అక్కడ సరిగా చదవకపోయినా పై తరగతికి ప్రమోట్‌ చేయడంతో వారి తల్లిదండ్రులు తిరిగి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన విషయాన్ని ఉపాధ్యాయులు కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన అందుతోందనే నమ్మకం ప్రజల్లో పెరుగుతోందనడానికి ఇదో ఉదాహరణ అని కలెక్టర్‌ అన్నారు. డీఈవో కె.వాసుదేవరావు, ఎంపీడీవో కె.సునీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌, ఎంఈవోలు ఏఆర్‌కేడీ తులసీదాస్‌, చందుకుమార్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయిని ఉషారాణి పాల్గొన్నారు.

ప్రభుత్వ భవనాలపై సోలార్‌ యూనిట్లు

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలోని ప్రతి ప్రభుత్వ భవనం, కార్యాలయంపై సోలార్‌ పవర్‌ యూనిట్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గించే అవకాశాలు ఉన్నాయని కలెక్టర్‌ కీర్తి అన్నారు. ఆమె వివిధ శాఖల అధికారులతో గూగుల్‌ మీట్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. సచివాలయ భవనాల రూఫ్‌టాప్‌ సమాచారం, పూర్తికాని అంగన్‌వాడీ భవనాలు, విద్యామిత్ర , వాట్సాప్‌ గవర్నెన్స్‌ సేవలు, జలధార – జలహారతి పనులు, రెవెన్యూ పన్నుల వసూళ్లపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ కీర్తి మాట్లాడుతూ వాట్సాప్‌ గవర్నెన్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

కలెక్టర్‌ కీర్తి చేకూరి

Advertisement
 
Advertisement
Advertisement