● నియంత్రించకుంటే ప్రత్యక్ష కార్యాచరణ
● ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు
కపిలేశ్వరపురం (మండపేట): చంద్రబాబు ప్రభుత్వ పాలనా తీరుతో ఆక్వా రైతులు కుదేలవుతున్నారని, వారిని కనీసం పట్టించుకుంటున్న పాపాన పోలేదని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి మంగళవారం వీడియో మాధ్య మం ద్వారా ప్రభుత్వ వైఖరిని ఖండించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ లెక్కల్లో 4.30 లక్షలు, వాస్తవంగా 10 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారని, ఆక్వా రైతులను ఫీడ్, ఎగుమతి పరిశ్రమల నిర్వాహకులు దోచుకుంటున్నారన్నారు. వారి దోపిడీకి తట్టుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాల్లోని ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రభుత్వ అసమర్థత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఆక్వా ఉత్పత్తుల ఎగుమతి, ఫీడ్ పరిశ్రమల యాజమానులు వారి వారి పరిధుల్లో సిండికేట్ అయ్యి ఫీడ్ ధరలను పెంచేస్తున్నారన్నారు. ఫీడ్ తయారీ ముడిసరుకు ఈ దేశంలోనే లభ్యమవుతున్నప్పటికీ ధరలను ఎందుకు పెంచుతున్నారో ప్రభుత్వం చెప్పాలన్నారు.
ధరల నిర్ధారణ విషయంలో రైతులతో కానీ, ఏపీఈడీఏ సంస్థతో కానీ ఏ మాత్రమూ సంప్రదించడంలేదన్నారు. కడుపు మండిన రైతులు యాజమానులను ప్రశ్నిస్తే.. కూటమి ప్రభుత్వం తమ కృషి వల్ల వచ్చిందని, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండని చెబుతున్నారని రైతులు అంటున్నారన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక పరిస్థితులు ప్రభుత్వ అసమర్థతను తెలియజేస్తున్నాయన్నారు. సిండికేట్లను నియంత్రించే బాధ్యత ప్రభుత్వానిదన్నారు. కరోనా కాలంలో ఆక్వా ఉత్పత్తులను చెరువుల్లోనే వదిలేసే సంక్షోభం తలెత్తినప్పుడు అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చర్యలతో ఆక్వా రైతులను ఆదుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం రైతుల పక్షాన నిలవకుండా కేవలం ఆదుకుంటామన్న ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతోందన్నారు. వైఎస్సార్ సీపీ ఆక్వా రైతులకు అండగా నిలుస్తుందని, ప్రభుత్వం రైతులను ఆదుకోని పక్షంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని ఎమ్మెల్సీ తోట హెచ్చరించారు.


