డీఆర్‌ఓ సీతారామమూర్తి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జిల్లావ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని డీఆర్‌ఓ సీతారామమూర్తి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పోలీసు శాఖ పరీక్ష కేంద్రాల వద్ద 163 బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ అమలు చేయడం, ప్రశ్నపత్రాల తరలింపు సమయంలో భద్రత కల్పించడం, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. విద్యుత్ శాఖ పరీక్ష సమయాల్లో ఎటువంటి విద్యుత్ అంతరాయం కలగకుండా నిరంతర సరఫరా అందించాలని సూచించారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకోవడానికి వీలుగా ఆర్టీసీ అదనపు బస్సులను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఏఎన్‌ఎంలు, ప్రాథమిక చికిత్స కిట్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆరోగ్య శాఖకు సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద పారిశుధ్యం, స్వచ్ఛమైన తాగునీరు, విద్యార్థులకు అవసరమైన కనీస వసతులు కల్పించాలని మున్సిపల్, రెవెన్యూ శాఖలను ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్‌ఐఓ శారద హెచ్చరించారు.


