అవే వినతులు మళ్లీ మళ్లీ | - | Sakshi
Sakshi News home page

అవే వినతులు మళ్లీ మళ్లీ

May 12 2026 12:26 AM | Updated on May 12 2026 12:26 AM

విన్నవించిన సమస్యలపైనే మళ్లీ మళ్లీ అర్జీలు

సర్వే మాయాజాలంలో భూములు గల్లంతు

క్షేత్రస్థాయిలో పరిష్కరించని అధికారులు

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): వచ్చిన దరఖాస్తులే మళ్లీ మళ్లీ వస్తున్నాయంటే రెవెన్యూ క్లినిక్‌లో ఏ మేరకు సమస్యలు పరిష్కారమవుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. సోమవారం నిర్వహించిన రెవెన్యూ క్లినిక్‌ (పీజీఆర్‌ఎస్‌)లో 85 అర్జీలు మాత్రమే వచ్చాయి. వీటిలో భూ సమస్యలపై వచ్చేవే 80 శాతం ఉన్నాయి. గతంలో ఇచ్చిన సమస్యలపైనే మళ్లీ మళ్లీ ఫిర్యాదులు వస్తుండడం గమనార్హం. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో స్పందన, జగనన్నకు చెపుదాం కార్యక్రమాలలో ఇచ్చిన దరఖాస్తులకు ఎంత వేగంగా పరిష్కారాలు దొరికేవోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌లలో కలెక్టర్‌ కీర్తి మొత్తం 201 అర్జీలు స్వీకరించారు.

సర్వే నంబర్లు మార్చేశారు

బిక్కవోలు మండలం బలభద్రపురంలో నా భార్య చింతా లక్ష్మికి సర్వే 425లో 54 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. 1995లో ఒకసారి, 2022లో సర్వే చేసి అన్నీ బాగుండడంతో అమెకు పట్టా మంజూరు చేశారు. కానీ తాజా సర్వేలో ఆన్‌లైన్‌లో ఆ భూమిని వేరే సర్వేలోకి మారిపోయింది. దీంతో ఆ సర్వేపై ఆమె రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సి ఉంది. అలాగే తన అత్త మేడపాటి వరలక్ష్మికి సర్వే నంబర్‌ 88 1సీలో 150 సెంట్లు ఉండగా గతంలో దానికి పట్టా ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో చేపట్టిన సర్వేలో 140 సెంట్లకి మాత్రమే పట్టా ఇచ్చి 10 సెంట్ల భూమి లేకుండా చేశారు. తనకు సర్వే నంబర్‌ 425లో 54 సెంట్లు భూమి ఉంది. దానికి గతంలో సర్వే చేసి పట్టా ఇచ్చారు. ఇప్పుడు సర్వేలో 2015లో చనిపోయిన మామయ్య మేడపాటి సత్యనారాయణ రెడ్డి పేరు మీద అన్‌లైన్‌ పెట్టి నా పేర మీద భూమిని తొలగించారు.

– చింతా డేవిడ్‌ రాజా రెడ్డి, ఫిర్యాదు దారుడు

డ్రోన్‌ సర్వేలో మాయం చేశారు

నాకు తాళ్లపూడి మండలం, పోచవరం వద్ద ఎకరం 8 సెంట్ల భూమి ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత డ్రోన్‌ సర్వే చేపట్టి ఆ భూమిని లేపేశారు. రెండేళ్లుగా కలెక్టరేట్‌కి తిరుగుతున్నా ఇప్పటి వరుకు న్యాయం చేయలేదు.

– దుగ్గిరాల శ్రీనివాసరావు, ఫిర్యాదుదారు

15 ఎకరాలకు అడ్డుగా గట్టు కట్టారు

తాళ్లపూడి మండలం పైడిమెట్ట గ్రామం వద్ద 20 మంది రైతులకు కలిపి 15 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమి చుట్టూ కొంత ఆర్‌ అండ్‌ ఆర్‌ భూమి ఉండేది. ఈ భూములను కబ్జా చేయడంతో మురుగునీరు తమ పొలాల్లో ఆగిపోతోంది. దీంతో తమ పంటలు పాడైపోతున్నాయి. మురుగు నీరు వెళ్లిపోవడానికి మార్గం చూపించాలని ఇప్పటికి చాలా సార్లు అర్జీ పెట్టినా పరిష్కారం కాలేదు.

– పులప కృష్ణారావు, అర్జీదారు

చంద్రబాబు చెప్పారని...

వికలాంగులకు అదనంగా 35 కేజీల బియ్యం ఇస్తారని సచివాలయ ఉద్యోగులు వచ్చి సర్వే చేపట్టారు. ఇప్పటి వరుకు బియ్యం ఇవ్వలేదు. ఏడాదిన్నర నుంచి కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతున్నా. చంద్రబాబు చెప్పారని ఎందుకు వేలి ముద్రుల తీసుకున్నారు. అసలు ఇస్తారో, ఇవ్వరో తెలియాలి.

– రొక్కం నీలకంఠేశ్వరరావు, అర్జీదారుడు

Advertisement
 
Advertisement
Advertisement