వాడపల్లి–1లో ఇసుక ర్యాంప్‌లో లారీలకు ఎగుమతి చేస్తున్న ప్రోక్లైయినర్‌లు
● అనుచిత రీతిలో భారీ దోపిడీ
● అధికారులతో కాంట్రాక్టర్ల కుమ్మక్కు!
● అన్నీ తెలిసినా నిద్ర నటిస్తున్నవైనం
పెరవలి (కొవ్వూరు): కాంట్రాక్టర్లకు కాసులు కురిపించడానికే ఉచిత ఇసుక పథకాన్ని ప్రభుత్వం రూపొందించినట్టుంది. అధికారులు, నాయకుల కళ్లెదుటే లారీ డ్రైవర్ల నుంచి అదనపు వసూళ్లు చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 20 టన్నుల ఇసుక గుట్టల వద్దే రూ.4300 విక్రయిస్తున్నా ప్రశ్నించేవారు లేకపోవడం శోచనీయం. కాంట్రాక్టర్లు, దళారులు, అధికారుల పటిష్టమైన సమన్వయంతో దోపిడీ పర్వం సాగుతున్న నేపథ్యంలో పేదలకు ఉచిత ఇసుక ఏ మేరకు అందుతోందో వేరే చెప్పాల్సిన పనిలేదని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
మామూళ్ల మత్తులో..
కొవ్వూరు నియోజకవర్గంలో వాడపల్లి, ఔరంగబాద్, కొవ్వూరు, అరికలరేవు, కుమారదేవం, వేగేశ్వరం, తాళ్లపూడి, ప్రక్కిలంక ఇసుక ర్యాంపుల్లో జరుగుతున్న అవినీతికి అంతులేకుండా పోయింది. అధికారుల కళ్లెదుటే కాంట్రాక్టర్లు అధిక మొత్తంలో సొమ్ములు వసూలు చేస్తున్నారంటే నెలవారీ చదివింపులు ఏ స్థాయిలో సాగుతున్నాయో అర్ధంచేసుకోవచ్చని బహిరంగంగానే చర్చ సాగుతోంది.
ప్రభుత్వ రేటు ఎంత?
నియోజకవర్గంలో ఇసుక లభ్యత ఉన్న 7 ఓపెన్ రీచ్‌లు, 8 పడవల ద్వారా లభ్యమయ్యే ఇసుక రీచ్‌లను జిల్లా అధికారులు గుర్తించి ఇసుక సరఫరా చేయాలని ఆదేశించారు. దీనికి ముందు టెండర్లు పిలిచి తక్కువ టెండరు వేసినవారికి రీచ్‌లను అప్పగించారు. టెండర్ దక్కించుకున్నవారికి ఒక్కో రీచ్‌కు అధికారులు ఒక్కో ధర నిర్ణయించారు. ఈ ర్యాంపుల్లో టన్ను ఇసుక రూ.68 నుండి రూ.110కు సరఫరా చేస్తామని కాంట్రాక్టర్లు టెండర్లు వేస్తారు. దీని ప్రకారం ర్యాంపులో లారీ ఇసుక (20 టన్నులకు) ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం రూ.1380 నుంచి రూ.1921 వసూలు చేయాల్సి ఉంది. కానీ రూ.4 వేల నుంచి రూ.4300 వరకు విక్రయిస్తున్నారు. అదే ట్రాక్టరుకై తే రూ.వెయ్యి వరకు వసూలు చేస్తున్నారు.
మొత్తం వసూళ్లు ఇలా..
నియోజకవర్గంలోని 15 ర్యాంపుల్లో నిత్యం 50 నుంచి వంద లారీల చొప్పున సుమారు 750 లారీల ఇసుక ఎగుమతి అవుతుంది. వీటికి తోడు ట్రాక్టర్ల ద్వారా ఎగుమతి అవుతున్న ఇసుకకు రూ.17.25 లక్షలు కాంట్రాక్టర్లకు చేరుతోంది. ఇలా నెలకు రూ.5.17 కోట్లు వసూలు చేస్తున్నారు. అధికారుల సమక్షంలోనే ఈ దందా సాగుతున్నా సొమ్ములు కాంట్రాక్టర్ నియమించిన వ్యక్తులే వసూలు చేయడం గమనార్హం. కాగా నదీగర్భం నుంచి ఇసుక తీసుకువస్తున్న పడవల యజమానులకు, ఎగుమతి చేస్తున్న కూలీలకు మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తే రోజుకు రూ.500 నుంచి రూ.700 ఇస్తున్నారు.
చెప్పిన ధరలకు ఇవ్వడం లేదు
ఇసుక పాయింట్ల వద్ద ప్రభుత్వం చెప్పిన ధరలకు ఎగుమతి చేయటం లేదు. ఒక లారీకి అదనంగా రూ.2300 తీసుకుంటున్నారు. కాదంటే ఒప్పుకోవడం లేదు.
– ఆర్.సత్యనారాయణ, లారీ డ్రైవర్, భీమవరం
గంటల తరబడి నిరీక్షణ
అడిగిన సొమ్ములు ఇవ్వకపోతే ఇసుక ఇవ్వటం లేదు. రోజంతా పడిగాపులు తప్పడంలేదు. ఎంత ఎక్కువ డబ్బులు ఇస్తే అంత ముందర లోడ్ చేస్తున్నారు.
– వి సుబ్బారావు,
లారీ డ్రై యివర్ తాడేపల్లి గూడెం


