● వైఎస్సార్ సీపీ జాతీయ అధికార
ప్రతినిధి భరత్‌రామ్ ఆగ్రహం
● పోలీసులతో వాగ్వాదం
● దూరం నుంచే నివాళులర్పించిన వైనం
రాజమహేంద్రవరం సిటీ: చంద్రబాబు పాలనలో స్వాతంత్ర సమరయోధుల విగ్రహాల సందర్శనను పోలీసులు అడ్డకోవడం దారుణమని వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నగరంలోని కంబాలచెరువు సెంటర్‌లోని చిరంజీవి బస్ స్టాప్ వద్ద ఉన్న దండి మార్చ్ విగ్రహాల సందర్శనకు వెళ్లిన భరత్‌రామ్‌ను సందర్శనకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. స్వతంత్ర సమరయోధుల విగ్రహాలపై దుమ్ము పేరుకుపోవడంతో స్వచ్ఛంద సంస్థ పెయింటింగ్ వేసి మరమ్మత్తులు చేసింది. దీనిని చూసేందుకు వచ్చిన భరత్‌రామ్‌ను అధికారులు, పోలీసులు అడ్డుకోవడంతో ఆయన దూరం నుంచే విగ్రహాలకు నివాళులు అర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను ఏర్పాటు చేసిన విగ్రహాలను అధికారం లేకపోవడంతో చూడకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం చలివేంద్రం ఏర్పాటు చేద్దామన్నా అడ్డుకుంటున్నారని అన్నారు. దేశభక్తిని చాటుతూ ఢిల్లీ తరహాలో రాజమహేంద్రవరంలో దండి మార్చ్ విగ్రహాలను తీసుకువచ్చానన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వాటిని పట్టించుకోకపోతే స్వచ్ఛంద సంస్థతో రంగులు వేయించానని, దానిని చూడడానికి వస్తే అడ్డుకోవడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తాను చేసిన అభివృద్ధి పనులను ధ్వంసం చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందన్నారు. దండి మార్చ్ వంటి చారిత్రక స్ఫూర్తి కేంద్రాలను సంరక్షించడం ప్రభుత్వ బాధ్యతని ఆయన అన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు గుర్రం గౌతమ్, వాసంశెట్టి గంగాధరరావు, దాసి వెంకటరావు, మజ్జి అప్పారావు, నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


