● 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌కు
పార్లమెంట్‌లో సవరణ చేయాలి
● ప్రభుత్వానికి రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ సంఘం నాయకుల వినతి
సీటీఆర్‌ఐ: మత స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కని, దళితులు క్రైస్తవ మతం తీసుకుంటే ఎస్సీ హోదా కోల్పోకూడదని రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ సంఘం నాయకులు అన్నారు. స్థానిక హొటల్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయిన రామారావు మాట్లాడుతూ ఎస్సీలు క్రైస్తవం లోకి మారినా ఎస్సీలకు ఉండే ప్రయోజనాలు కోల్పోకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, దీనికోసం 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డరుకు పార్లమెంటులో సవరణ చేసి ఆమోదింపజేయాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు బి.జార్జి ఆంటోని మాట్లాడుతూ ఇతర మతాల్లోకి మారితే కోల్పోని ఎస్సీ హోదా క్రైస్తవంలోకి మారితే ఉండదనడం అన్యాయమని పేర్కొన్నారు. రాష్ట్ర చైర్మన్ గుమ్మడి సమర్పణరావు, వైస్ చైర్మన్ ఎల్‌వీ ప్రసాద్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా పని చేసే తమ సంఘం ఎస్సీ క్రిష్టియన్లపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు పోరాడుతుందని, క్రైస్తవం లోకి మారినా ఎస్సీ హోదా కోల్పోకుండా దేశ వ్యాప్త ఉద్యమం రావాలని వారు కోరారు. సంఘ సభ్యుడు నంబూరి రవీంద్ర మాట్లాడుతూ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డరు ప్రకారం ఎస్సీల్లో 59 ఉప కులాలు ఉన్నాయని, అందులో ఉన్న సిక్కులు, బౌద్ధులు మతం మారినా ఎస్సీ హోదా పోకుండా ఆ ఆర్డరుకు సవరణ చేయించుకున్నారని వివరించారు. దళితుల కోసం ఆ ఆర్డరుకు సవరణ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మట్టపర్తి సత్యనారాయణ, పోలవరపు రాము, నక్కా సోమేశ్వరరావు పాల్గొన్నారు.


