ఫ రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ఫ మరొకరికి తీవ్ర గాయాలు
కూనవరం: వేగం... ఇద్దరి ప్రాణాలను బలిగొంది. కూలి పనులు చేస్తూ కుటుంబాలకు ఆసరాగా ఉంటున్న వారి మృతితో విషాదం నెలకొంది. ఈ ఘటన అభిచర్ల గ్రామ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై బి.రామకృష్ణ కథనం ప్రకారం.. పంద్రాజుపల్లి గ్రామం నుంచి చింతూరు వైపు ద్విచక్ర వాహనంపై పంద్రాజుపల్లికి చెందిన వంజం లక్ష్మణ్ (24), ముల్లూరుకు చెందిన పద్దం కార్తీక్ (25), అభిచర్ల గ్రామానికి చెందిన శ్యామల భీమేశ్వరరావు వస్తున్నారు. అభిచర్ల గ్రామ సమీపంలో మలుపు వద్ద వేగంగా వస్తున్న కంకర లోడు ట్రాక్టర్‌ను వీరు ఢీకొన్నారు. వెంటనే ఆ ముగ్గురూ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. తీవ్ర రక్తస్రావం కావడంతో వంజం లక్ష్మణ్, కార్తీక్ అక్కడికక్కడే మృతి చెందారు. భీమేశ్వరరావుకు తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్‌లో కోతులగుట్ట సీహెచ్‌సీకి తరలించి ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం భద్రాచలానికి రిఫర్ చేసినట్లు వైద్యులు తెలిపారు. కాగా ఘటనా స్థలాన్ని ఎస్సై రామకృష్ణ సందర్శించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సీహెచ్‌సీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


