వై.రామవరం: మండలంలోని కొమరవరం గ్రామ జంక్షన్‌లో రూ.50 లక్షల విలువైన వంద కిలోల గంజాయిని పట్టుకున్నట్లు అడ్డతీగల సీఐ బి.నరసింహమూర్తి, ఎస్సై ఎస్.పృథ్వీయాదవ్ తెలిపారు. ఓ కారును, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఈ మేరకు మహారాష్ట్రాకు చెందిన మహేష్ మార్కెట్ (35), రఫిన్ జిలాల్ పింజారి (27)లను కోర్టులో హాజరుపరిచగా, న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు చెప్పారు. గంజాయిని ఒడిశా రాష్ట్రం నుంచి వై.రామవరం మండలం మీదుగా మహారాష్ట్రాకు తరలిస్తున్నారని అన్నారు. సోమవారం ఉదయం కొమరవరంలో వీరు పట్టుబడ్డారు. మొత్తం ఐదుగురు నిందితులు కాగా, ముగ్గురు పరారీలో ఉన్నారన్నారు. వీరంతా గంజాయి కేసుల్లో పాత నిందితులని సీఐ వివరించారు.
సెల్ టవర్ ఎక్కి
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
యానాం: పోలీసులు వేధిస్తున్నారంటూ యానాంలో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన సంచలనం రేపింది. ఎన్నికలకు సంబంధించి సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టు షేర్ చేశాడనే అభియోగంతో పట్టణ పరిధిలో మహ్మద్ అహ్మద్ అలీషాకి సంబంధించిన సెల్ ఫోన్‌ను పోలీసులు ఇటీవల స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అతన్ని రోజూ స్టేషన్‌కు పిలవడం, సాయంత్రం వెళ్లిపోమని చెప్పడం, వారం రోజులుగా జరుగుతుంది. తన సెల్ ఫోన్ తిరిగి ఇవ్వాలంటూ అలీషా సోమవారం మధ్యాహ్నం స్థానిక సిద్ధార్ధనగర్‌లోని సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అక్కడకు ఎస్పీ వరదరాజన్, ట్రైనీ ఎస్పీ చిట్టిరాజు, సీఐ షణ్ముకసుందరం, ఎస్సై కొమరన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్ధాని దినేష్, శివ తదితరులు చేరుకుని దిగిరావాలని కోరారు. ఇలా రెండు గంటల పాటు ఉత్కంఠ నెలకొంది. ఆఖరికి ఎస్సై కొమరన్ సెల్‌ఫోన్ తీసుకుని రావడంతో అలీషా కిందకు దిగాడు. సెల్‌ఫోన్ ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ పోలీసులు పట్టుకువెళ్లడంతో, గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంటానని అలీషా అనడంతో సెల్‌ఫోన్ తిరిగి ఇచ్చారు.


