● సిండికేటు
పెరవలి: కొనుగోలు సంస్థలు సిండికేట్ అవుతున్నాయి.. ధర దారుణంగా తగ్గించేస్తున్నాయి.. రైతుల కష్టాన్ని కొల్లగొడుతున్నాయి.. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు.. సాధారణంగా ఏ వస్తువు ధర అయినా ఒక ఏడాదికి, మరో ఏడాదికి పెరుగుతూ ఉంటుంది. కానీ, తమ కష్టానికి మాత్రం ధర నానాటికీ పడిపోతోందని, నష్టాల ఊబిలో కూరుకుపోతున్నామని కోకో రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
ధర తగ్గించేశారిలా..
జిల్లావ్యాప్తంగా పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, చాగల్లు, దేవరపల్లి, కొవ్వూరు, కడియం, సీతానగరం, బిక్కవోలు తదితర మండలాల్లోని సుమారు 5 వేల మంది రైతులు దాదాపు 16 వేల హెక్టార్లలో కోకో సాగు చేస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో ఏటా సుమారు 2.64 లక్షల క్వింటాళ్ల కోకో గింజల ఉత్పత్తి జరుగుతోంది. ప్రతి పంటకు ఎకరానికి నాలుగైదు క్వింటాళ్ల వరకూ దిగుబడి రావాలి. గత ఏడాది 2 నుంచి 3 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. ఈ ఏడాది 3 నుంచి 4 క్వింటాళ్ల వరకూ వస్తోందని రైతులు చెబుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కిలో కోకో గింజలకు ఏకంగా రూ.1,050 ధర పలకడంలో రైతులకు మంచి లాభాలు వచ్చాయి. అటువంటిది చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత కొనుగోలు సంస్థలది ఇష్టారాజ్యంగా మారింది. ఆయా కంపెనీలు గత ఏడాది దారుణంగా ధర తగ్గించేయడంతో రైతులు సామూహికంగా ఉద్యమించారు. దీంతో, ప్రభుత్వం దిగివచ్చి, కిలో గింజల ధరను రూ.650గా నిర్ణయించింది. ఈ ఏడాది ధర అంతకంటే అధికంగా ఉండాలి. కానీ, ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా.. కొనుగోలు సంస్థలు సిండికేట్ అయ్యి, ధరను ఏకంగా రూ.300కు తగ్గించేశాయి. అది కూడా కొనుగోలు కేంద్రాల్లో మామూళ్లు ఇస్తేనే కొంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోకో గింజలను ఫ్యాక్టరీలకు తీసుకెళ్తే కనీసం గేట్లు కూడా తీయడం లేదని, మార్కెట్ ధరకే అమ్ముతామన్నా వద్దంటున్నారని వాపోతున్నారు. అన్నీ ప్రైవేటు సంస్థలు కావడంతో వారు ఆడింది ఆట.. పాడింది పాటగా మారిందని దుయ్యబడుతున్నారు. నాణ్యతను బట్టి అంతర్జాతీయ మార్కెట్లో కిలో కోకో గింజల ధర రూ.750 నుంచి రూ.800 పలుకుతుండగా.. కనీసం రూ.500కు కూడా కొనుగోలు చేయడం లేదని మండిపడుతున్నారు. తమ కష్టనష్టాలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు.
ఆదారపడిన జనం
జిల్లాలో కోకో సాగుపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి 15 వేల మంది జీవిస్తున్నారు. ఈ ఏడాది గిట్టుబాటు ధర లభించకపోవడంతో కూలీలను పెట్టుకోవడానికి చాలా మంది రైతులు విముఖత చూపుతున్నారు. పలువురు రైతులు సొంతంగా కాయలు కోసి, గింజలు తీసుకుంటున్న పరిస్థితి నెలకొంది. కొంత మంది రైతులు మాత్రం తక్కువ సంఖ్యలో కూలీలను పెట్టుకుంటున్నారు. కోకో సాగుకు అధిక మొత్తంలో ఎరువులు అవసరమవుతాయి. తెగుళ్లు కూడా ఎక్కువగానే వస్తాయి. అందువలన పురుగు మందులు కూడా వినియోగించడం తప్పనిసరి. దీంతో, ఎకరానికి రూ.60 వేల వరకూ పెట్టుబడి అవుతోంది. ఈ పరిస్థితుల్లో గత ఏడాది కంటే దిగుబడి పెరిగినప్పటికీ, కంపెనీలు ధరను తగ్గించేయడంతో రైతులు తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. వచ్చిన సొమ్ము ఖర్చులకు సరిపోతుందని, మగతాకు ఎక్కడి నుంచి తేవాలని వాపోతున్నారు. సిండికేట్ అయితే రైతులు అయిన కాడికి అమ్ముకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని, అందుకే కంపెనీలు ధర తగ్గించేశాయని రైతులు ఆరోపిస్తున్నారు.
ధర తగ్గించేశారు
కోకోకు గత ఏడాది కంటే అధిక ధర లభిస్తుందని ఆశించాం. కానీ, తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాది కంటే దిగుబడి పెరిగినా నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. అయిన కాడికి అమ్ముకోవాల్సి వస్తోంది.
– కంటిపూడి సూర్యనారాయణ,
రైతు, తీపర్రు, పెరవలి మండలం
మరీ ఇంత దారుణమా?
కొనుగోలు కంపెనీలు సిండ్‌కేటుగా మారి కోకో గింజల ధరను తగ్గించాశాయి. కిలో రూ.300కే అమ్ముదామన్నా కొనే నాథుడే లేడు. ఇంత దారుణం ఎప్పుడూ చూడలేదు. ప్రభుత్వం పట్టించుకోవటం లేదు.
– వాకలపూడి సూర్యారావు,
రైతు, కానూరు, పెరవలి మండలం
నష్టాల ఊబిలో కోకో రైతులు
వైఎస్సార్ సీపీ పాలనలో కిలో
కోకో గింజల ధర రూ.1,050
గత ఏడాది కిలోకు రూ.650
నేడు కేవలం రూ.300
సిండికేట్ అయ్యి, ధర
తగ్గించేస్తున్న సంస్థలు
పట్టించుకోని ప్రభుత్వం


