మృత్యు శకటాలు | - | Sakshi
Sakshi News home page

మృత్యు శకటాలు

May 11 2026 8:32 AM | Updated on May 11 2026 8:32 AM

నిండు ప్రాణాలను బలిగొంటున్న

ఇసుక లారీలు

చంద్రబాబు పాలనలో దర్జాగా

అక్రమ రవాణా

కళ్లెం లేకుండా ఇసుక లారీల పరుగులు

ప్రమాదాలు జరుగుతున్న

పట్టించుకోని అధికారులు

కపిలేశ్వరపురం: ఇసుక లారీలు మృత్యు శకటాలుగా మారుతున్నాయి. కళ్లెం లేని గుర్రాల్లా అడ్డూ అదుపూ లేకుండా రోడ్లపై పరుగులు పెడుతూ నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. మరోవైపు భారీ ఇసుక లారీల రాకపోకలతో రోడ్లు ఛిద్రమవడంతో జరుగుతున్న ప్రమాదాలు కూడా ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. చంద్రబాబు నేతృత్వంలోని 2014–19, ప్రస్తుత ప్రభుత్వాల కాలంలో ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నారు. అయితే, ఆ ముసుగులో అధికార పార్టీల నేతలు పలువురు ఇసుక మాఫియా అవతారమెత్తి అక్రమాలకు తెర తీస్తున్నారు. ఇసుక తవ్వకాల నుంచి రవాణా వరకూ నిబంధనలను గోదాట్లో తొక్కేస్తున్నారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్న పవన్‌ కల్యాణ్‌ ఇసుక అక్రమాలను కనీసంగా కూడా పట్టించుకోవడం లేదు. వైఎస్సార్‌ సీపీ, వామపక్షాలు, ప్రజా సంఘాల నేతలు ప్రశ్నిస్తే ప్రభుత్వం వేధింపులకు దిగుతోందన్న విమర్శలున్నాయి. మొత్తంం మీద ఇసుక మాఫియా అక్రమాలకు సామాన్యుల ప్రాణాలు బలవుతున్న పరిస్థితి దాపురించింది.

తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి, కొవ్వూరు, పెరవలి, సీతానగరం మండలాలతో పాటు రాజమహేంద్రవరం, తాతపూడి, కపిలేశ్వరపురం, కోనసీమ జిల్లా జొన్నాడ, ఊబలంక, పి.గన్నవరంలోని పలు ర్యాంపుల్లో గోదారి తల్లికి నిలువునా తూట్లు పొడుస్తూ, అక్రమార్కులు పెద్ద మొత్తంలో ఇసుకను కొల్లగొడుతున్నారు. దీనిని నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా రవాణా చేస్తూ, అమ్ముకుని, రూ.కోట్లలో సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో జరుగుతున్న ప్రమాదాలు సామాన్యుల కుటుంబాలను ఛిద్రం చేస్తున్నాయి. 2014–19, ప్రస్తుత చంద్రబాబు పాలనలో ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయి. దీంతో, మృతుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.

కొన్ని ప్రమాదాలు ఇలా..

● 2015 మే 25: అచ్యుతాపురం వద్ద ఇసుక లారీ ఢీకొని, వల్లూరుకు చెందిన పాలచర్ల సత్యనారాయణ మృతి చెందారు.

● 2017 జూన్‌ 7: కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి గ్రామ శివారు చిన కోరుమిల్లికి చెందిన గంగుమళ్ళ సూర్యచంద్రరావు (51) గోదారి గట్టుపై ఇసుక లారీ ఢీకొని ప్రాణాలు వదిలారు.

● 2017 నవంబరు 18: తాతపూడి శివారు గోపాలరావుపేట వద్ద గోదావరి గట్టుపై ఎదురుగా వస్తున్న ఇసుక లారీ ఢీకొని, కేదారిలంక గ్రామానికి చెందిన గంధం ఈశ్వరరావు(32), వీరా జయబాబు(26) దుర్మరణం పాలయ్యారు.

● 2018 జనవరి 9: కోరుమిల్లి గ్రామానికి చెందిన సలాది సత్తిబాబు అక్కడి ఇసుక ర్యాంపులో జట్టు కార్మికుడిగా పని చేస్తూంటారు. గోదావరి గట్టుపై ఇసుక లారీ ఢీకొని మరణించారు.

● ఈ నెల 2: కొత్తపేట బోడిపాలెం వంతెన వద్ద ఊబలంక ర్యాంపునకు వెళ్తున్న టిప్పర్‌ ఢీకొట్టడంతో అయినవిల్లి మండలం చింతనలంక గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ విళ్ల గీతారాణి (24) అక్కడికక్కడే మృతి చెందారు.

● ఈ నెల 9: మండపేట బైపాస్‌ నాలుగు రోడ్లు జంక్షన్‌ వద్ద ఇసుక టిప్పర్‌ ఢీకొనడంతో పట్టణానికి చెందిన అన్నదమ్ముల పిల్లలు దార్ల దుర్గాప్రసాద్‌, దార్ల శివకుమార్‌ దుర్మరణం పాలయ్యారు.

మట్టి శ్రీకొట్టేస్తున్నారుశ్రీ

మండపేట మండలం కేశవరంలో రేయిబవళ్లు గ్రావెల్‌ను అక్రమంగా తరలించేస్తున్నారు. జిల్లాలోని కోరుకొండ, సీతానగరం, కడియం తదితర మండలాల్లో పెద్ద మొత్తంలో గ్రావెల్‌, చెరువు మట్టి అక్రమంగా తవ్వేసి, తరలించుకుపోతూ, కూటమి నేతలు ప్రతి రోజూ రూ.లక్షల్లో కొల్లగొడుతున్నారు. పి.గన్నవరం మండలం యర్రంశెట్టివారిపాలెం ఏటిగట్టు దిగువన లంకల గన్నవరం, ఊడుమూడి శివారు ఊడుమూడి లంకల్లో అనుమతి లేకుండా ఈ నెల మొదటి వారంలో మట్టి తవ్వకాలకు పాల్పడ్డారు. ఇంకా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు, జగ్గంపేట, తుని నియోజకవర్గాల్లో అవకాశమున్న ప్రతి చోటా మట్టి, గ్రావెల్‌ కొల్లగొట్టి, జేబులు నింపుకొంటున్నారు. కళ్ల ముందే ఇన్ని అక్రమాలు, సహజ వనరుల దోపిడీ విశృంఖలంగా సాగుతున్నా అధికార కూటమి నేతలు కావడంతో అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement