● మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్
● ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహణ
రాజమహేంద్రవరం సిటీ: మార్గాని భరత్ ఫౌండేషన్ ద్వారా నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్ తెలిపారు. ఈ నెల 12న ఆయన పుట్టిన రోజు, ఆదివారం అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక కృష్ణా నగర్ వీవీ గార్డెన్స్ కల్యాణ మండపంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో ఆయన మాట్లాడారు. ఈ శిబిరంలో క్యాన్సర్, గుండె, కిడ్నీ, ఊపిరితిత్తులు, కీళ్ల నొప్పులు, న్యూరో, డెంటల్, కళ్లు, గైనకాలజీ తదితర అన్ని విభాగాలకు సంబంధించిన సేవలు అందిస్తున్నామన్నారు. హైదరాబాద్ కాంటినెంటల్, రాజమహేంద్రవరం జీఎస్‌ఎల్, వాసన్ ఐ కేర్, మాగ్నా వంటి సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రుల నుంచి నిపుణులైన వైద్యులు వచ్చిన ఈ శిబిరంలో ఉచిత వైద్య పరీక్షలు చేశారని, ఉచితంగా మందులు అందించామని చెప్పారు. ఈ శిబిరంలో సుమారు 2 వేల మంది ఉచిత వైద్య సేవలు పొందారన్నారు. ప్రతి రెండు నెలలకు వైద్య శిబిరం నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ, భరత్‌ను అభినందించారు. ప్రభుత్వ పరంగా ఆరోగ్యశ్రీ సేవలు 80 శాతం మేర అందని ప్రస్తుత తరుణంలో ఇటువంటి శిబిరాలు నిర్వహించడం మంచి పరిణామమని అన్నారు. మార్గాని నాగేశ్వరరావు మాట్లాడుతూ, మార్గాని ఫౌండేషన్ ద్వారా గతంలో జాబ్ మేళాలు నిర్వహించి, 2 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించామని తెలిపారు. ఇప్పుడు ఈ వైద్య శిబిరం నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. రత్నం మెడికల్స్, రామలక్ష్మీ మెడికల్ ఏజెన్సీల ద్వారా మందులు అందజేశారు. ఆదిత్య కాలేజీ ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి జీవీఎస్ నాగేశ్వరరావు ఆధ్వర్యాన వలంటీర్లు సేవలందించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, తలారి వెంకటరావు, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్‌పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైఎస్సార్ సీపీ రామచంద్రపురం కో ఆర్డినేటర్ సూర్యప్రకాష్, సిటీ పరిశీలకుడు అద్దంకి ముక్తేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు, ఏపీఐడీసీ మాజీ డైరెక్టర్ కానుబోయిన సాగర్, రాష్ట్ర కార్యదర్శి వాసంశెట్టి గంగాధరరావు, పార్టీ కడియం మండల అధ్యక్షుడు స్టాలిన్, జిల్లా ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ దాసి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.


