సీసీ ఫుటేజీ బయట పెడితే అవినీతి బట్టబయలు | - | Sakshi
Sakshi News home page

సీసీ ఫుటేజీ బయట పెడితే అవినీతి బట్టబయలు

May 11 2026 8:32 AM | Updated on May 11 2026 8:32 AM

అనపర్తి: ఈవీఎంల సహకారంతో గెలిచిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి యథావిధిగా మాటల గారడీ చేస్తున్నారని అనపర్తి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి విర్శించారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ, అక్రమాలకు సంబంధించిన సాక్ష్యాలను ఇప్పటికే ప్రజల ముందు ఉంచామన్నారు. ఆయనకు ఎవరెవరు ఎంతెంత లంచాలు ఇచ్చారో గతంలో బాధితులే నేరుగా వెల్లడించారని, అవసరమైతే ప్రమాణం చేయడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఒక మద్యం షాపు యజమాని విషయంలో జరిగిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ, డబ్బులివ్వకముందు టీ ఇచ్చి పంపిన ఎమ్మెల్యే, ముడుపులు అందిన తర్వాత తన ఇంట్లో చేపల పులుసు బాగుంటుందని భోజనం పెట్టారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే ఇంటి పక్కనే దాదాపు ఏడాదిన్నర పాటు భారీ పేకాట డెన్‌ నడిచిందని, రోజుకు రూ.2 లక్షల చొప్పున భారీగా వసూళ్లు జరిగాయని, పరిస్థితి శ్రుతి మించడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు ఆ డెన్‌పై రైడ్‌ చేసిన విషయం ప్రజలు ఇంకా మర్చిపోలేదని చెప్పారు. తన ఇంట్లో జరిగిన రెండు శుభకార్యాల సందర్భంగా వ్యాపారవేత్తలను బెదిరించి వందకు పైగా బంగారు బిస్కెట్లు వసూలు చేశారంటూ నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారని డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డి అన్నారు. ఎమ్మెల్యే తన నిజాయతీ నిరూపించుకోవాలంటే ఆ కార్యక్రమాలకు సంబంధించిన సీసీ ఫుటేజీని ఎటువంటి కటింగ్స్‌ లేకుండా బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. అతిథులు లోపలకు వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకూ ఉన్న దృశ్యాలను ప్రజల ముందుంచాలని డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డి సవాల్‌ విసిరారు.

ఆటోడ్రైవర్‌ నిజాయతీ

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఓ ఆటో డ్రైవర్‌ తన నిజాయతీని చాటుకున్నాడు. కోటగుమ్మం సెంటర్‌ వద్ద ఉన్న ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తున్న మహిళ క్వారీ సెంటర్‌ వద్ద ఆటో ఎక్కి కోటగుమ్మం సెంటర్‌లో దిగింది. అనంతరం, ఆమె తన పర్సును ఆటోలో మరచిపోయినట్టు గుర్తించింది. ఆ ఆటో చుట్టుపక్కల ఉందేమోనని వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో ఆమె త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అదే సమయంలో ఆటో డ్రైవర్‌ తన ఆటోలో ఓ మహిళ పర్సు మరచిపోయిందంటూ త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి పోలీసులకు అప్పగించాడు. ఫిర్యాదు చేసిన మహిళ చెప్పిన వివరాలతో సరిపోల్చిన పోలీసులు.. ఆ పర్సు ఆమెదేనని నిర్ధారించి అందజేశారు. పోగొట్టుకున్న పర్సు తిరిగి దొరకడంతో మహిళ ఆనందం వ్యక్తం చేసింది. నిజాయతీగా వ్యవహరించిన ఆటో డ్రైవర్‌ను త్రీటౌన్‌ సీఐ వి.అప్పారావు, ఎస్సై వి.అప్పలరాజు, సిబ్బంది అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement