పగలంతా ఉక్కపోత.. రాత్రి కుండపోత | - | Sakshi
Sakshi News home page

పగలంతా ఉక్కపోత.. రాత్రి కుండపోత

May 11 2026 8:32 AM | Updated on May 11 2026 8:32 AM

రాజానగరం: చండప్రచండంగా కాసిన ఎండ తీవ్రత నుంచి ప్రజలు కాస్త సేద తీరారు. రాజానగరంలో ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. పగలంతా 39 డిగ్రీల ఉష్టోగ్రతలతో తల్లడిల్లిపోయిన జనాలు.. హఠాత్తుగా చల్లబడిన వాతావరణాన్ని హాయిగా ఆస్వాదించారు. ఈదురు గాలులు, చినుకులతో ప్రారంభమైన వర్షం క్రమంగా జోరందుకోవడంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. సుమారు గంటన్నర పాటు కుండపోతగా కురిసిన వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. బాటసారులు, బైకులపై ప్రయాణించేవారు షెల్టర్‌ కోసం పరుగులు తీశారు.

కలవరపడుతున్న రైతులు

అకస్మాత్తుగా కురిసిన వర్షం రైతులను కలవరపాటుకు గురి చేసింది. రబీ వరి కోతలు జరుగుతున్న వేళ కురిసిన ఈ వర్షంతో పంట నష్టం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. కోతలు జరిగిన చోట కళ్లాల్లో ఉన్న ధాన్యం తడిసి దెబ్బ తింటుందని అంటున్నారు. అలాగే, కోతకు సిద్ధంగా ఉన్న పొలాల్లోని వరి పైరు ఈదురు గాలులకు నేలకొరిగి, ధాన్యం గింజలు రంగు మారే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే, ఈ వర్షం వలన కోతలు పూర్తయిన పొలాల్లో వేసవి దుక్కులు చేపట్టే అవకాశం ఉంటుంది. రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది.

Advertisement
 
Advertisement
Advertisement