రొయ్యల మేత గోడౌన్‌ దగ్ధం | - | Sakshi
Sakshi News home page

రొయ్యల మేత గోడౌన్‌ దగ్ధం

May 11 2026 7:56 AM | Updated on May 11 2026 7:56 AM

కాట్రేనికోన: చెయ్యేరు అగ్రహారంలో ఆదివారం మధ్యాహ్నం రొయ్యల మేత గోడౌన్‌ కాలిపోయింది. అక్కడి శివపార్వతి ఆక్వా ఏజెన్సీస్‌ రొయ్యల మేత గోడౌన్‌లో బ్లీచింగ్‌, రాతి ముగ్గు నిల్వలు ఉన్నాయి. ఎండ తీవ్రతకు ఆ గోడౌన్‌లో ఉన్న బ్లీచింగ్‌, రాతి ముగ్గు కెమికల్‌ రియాక్షన్‌తో మంటలు వ్యాపించాయి. గోడౌన్‌ పక్క షాపులో ఉన్న నాలుగు మోటారు సైకిళ్లు, బ్లీచింగ్‌, రాతి ముగ్గు, రొయ్యల చెరువులకు వాడే మందులు కాలిబూడిదయ్యాయి.

రైలు నుంచి జారి వ్యక్తి మృతి

తుని: రైలు నుంచి జారిపడి విశ్రాంత ఆర్మీ ఉద్యోగి ఆదివారం మృతి చెందారు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. అసోంకు చెందిన విశ్రాంత ఆర్మీ ఉద్యోగి ప్రమోద్‌ బోర్డోలోయ్‌ (61) అసోం నుంచి హైదరాబాద్‌కు రైలులో ప్రయాణిస్తున్నారు. స్థానిక రైల్వే స్టేషన్‌ పరిధి హంసవరం రైల్వే గేటు సమీపంలో ప్రమోద్‌ ప్రమాదవశాత్తూ కాలు జారి రైలు నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై స్థానిక రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ శ్యామ్‌ త్రినాథరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని తుని ఏరియా ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు ఆయన తెలిపారు.

పిల్లలను చూడడానికి రావొద్దనడంతో ఆత్మహత్య

కొత్తపల్లి: తన పిల్లలను చూడడానికి రావొద్దని భార్య అనడంతో మనస్తాపం చెందిన ఓ భర్త పురుగు మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. ఉప్పాడ నాయకర్‌ కాలనీకి చెందిన ఓసిపల్లి ఏసేబు (26) భార్య రెండో కాన్పు నిమిత్తం తన పుట్టింటికి అమీనాబాద్‌ వెళ్లింది. తన పిల్లలను చూడడానికి రావొద్దని భార్య అనడంతో మనస్తాపానికి గురై, భార్యను బెదిరించాలనే ఉద్దేశంతో ఈ నెల 8న ఏసేబు పురుగు మందు తాగాడు. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి తల్లి ఓసిపల్లి పాప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేష్‌ తెలిపారు.

ఫోన్‌ మాట్లాడుతూ

బస్సులు నడిపితే జైలుకే

అమలాపురం రూరల్‌: సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ స్కూల్‌, కళాశాలల బస్సులు నడిపితే జైలు శిక్ష తప్పదని కోనసీమ జిల్లా రవాణా శాఖాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు హెచ్చరించారు. అమలాపురంలో కళాశాల బస్సుల చోదకులకు ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50 కిలోమీటర్ల వేగంతో మాత్రమే బస్సులు నడపాలని, డ్రైవర్‌ చరవాణిని క్లీనర్‌ వద్ద ఉంచాలన్నారు. మోటార్‌ వాహనాల చట్టం 185 (జీ) ప్రకారం ప్రతి బస్సులో విద్యార్థులతో పాటు పేరెంట్‌, టీచర్‌ విధిగా ఉండాలన్నారు. అదే విధంగా డ్రైవర్‌ శారీరక, మానసిక పరిస్థితిని స్కూల్‌ యాజమాన్యం గమనిస్తూ ఉండాలని డీటీఓ సూచించారు. నెలాఖరు నాటికి జిల్లాలోని అన్ని విద్యాసంస్థల బస్సులు ఫిట్‌నెస్‌ పొందాలని పేర్కొన్నారు. జూన్‌ మూడో వారం నుంచి ప్రత్యేక తనిఖీలు చేపడతామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement