భార్య ఇంటి ముందు భర్త మృతదేహంతో నిరసన
మామిడికుదురు: అత్తింటి వారు పెట్టిన తప్పుడు కేసు ను అవమానంగా భావించి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడంటూ అతని కుటుంబ సభ్యులు, స్థానికులు నిరసన తెలిపారు. ఈ ఘటన పెదపట్నంలంకలో ఆదివారం ఉద్రిక్తతకు దారి తీసింది. మృతుడి బంధువుల కథనం ప్రకారం.. పెదపట్నంలంక గ్రామానికి చెందిన సూదా రాజు (26) ఎలుకల మందు తిని ఈ నెల 4న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతన్ని కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా, చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఆ మృతదేహాన్ని రాజు భార్య దివ్యజ్యోతి ఇంటి ఎదుట ఉంచి ఆందోళన చేపట్టారు. రాజు కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు భారీగా తరలివచ్చారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 21 రోజుల వయసు కలిగిన రాజు చిన్నారిని ఊయలలో వేసిన సందర్భంగా గొడవ జరిగిందని ఆందోళనకారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రాజు, అతని తల్లిదండ్రులపై దివ్యజ్యోతి కుటుంబ సభ్యులు దాడి చేశారని ఆరోపించారు. వారే దాడి చేసి తప్పుడు కేసు పెట్టారని వాపోయారు. పోలీసుల నుంచి పిలుపు రావడంతో దానిని అవమానంగా భావించి రాజు అత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. ఈ వివాదం నేపథ్యంలో నగరం ఎస్సై ఎ.చైతన్యకుమార్, పి.గన్నవరం, అయినవిల్లి ఎస్సైలు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుడు రాజు కుటుంబ సభ్యులు వస్తున్నారన్న సమాచారంతో దివ్యజ్యోతి కుటుంబ సభ్యులు అక్కడి నుంచి ముందుగానే వెళ్లిపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని రప్పించాలని, నిందితులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఫిర్యాదు ఇస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్సై చైతన్యకుమార్ స్పష్టం చేశారు. బాధ్యులను అక్కడకు రప్పించాలని రాజు మద్దతుదారులు డిమాండ్ చేయడంతో పరిస్థితి జఠిలంగా మారింది. ఆందోళన ఇంకా కొనసాగుతోంది.


