బస్సు ఢీకొని మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

బస్సు ఢీకొని మహిళ మృతి

May 11 2026 7:56 AM | Updated on May 11 2026 7:56 AM

సామర్లకోట: స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సు ఢీకొని ఓ మహిళ దుర్మరణం పాలైంది. పోలీసులు, ఆమె బంధువుల కథనం ప్రకారం.. రాజానగరం మండలం శ్రీరామపురానికి చెందిన భావన ధనలక్ష్మి (51) వడ్లమూరులోని తన బంధువుల గృహ ప్రవేశానికి వెళ్లి, తిరిగి స్వగ్రామానికి బయలు దేరింది. వడ్లమూరు నుంచి ఆర్టీసీ బస్సులో సామర్లకోట ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వచ్చింది. అక్కడ రాజానగరం బస్సు ఎక్కడానికి వెళ్తున్న తరుణంలో ఆమె దిగిన బస్సే ధనలక్ష్మి మీదుగా వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయాన్ని బంధువులకు చెప్పకుండానే మృతదేహాన్ని ఆర్డీసీ అధికారులు పెద్దాపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున సామర్లకోట ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుకున్నారు. అక్కడ బస్సులకు అడ్డుగా బైఠాయించారు. ప్రభుత్వ బస్సు ఢీకొంటే చనిపోతారని, మృతుల కుటుంబాలకు రూ. ఐదు వేల నష్ట పరిహారం ఇస్తారని అపహాస్యం చేసినట్లు ఇద్దరు సిబ్బంది మాట్లాడారంటూ మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ ఎ.కృష్ణభగవాన్‌ ఆందోళనకారులతో చర్చించారు. ఆర్టీసీ బస్సును నిర్లక్ష్యంగా నడిపిన వ్యక్తిపై కేసు పెడతామని చెప్పడంతో ఆందోళనకారులు శాంతించారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ. కోటి నష్ట పరిహారం ఇవ్వాలని వైఎస్సార్‌ సీపీ నాయకులు కంటే వీర్రాఘవరావు, మద్దాలి శ్రీను, ఎలిశెట్టి నరేష్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీరామపురంలో విషాదం

రాజానగరం: శ్రీరామపురానికి చెందిన భావన ధనలక్ష్మి (51) మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆమె భర్త భావన రత్తయ్య వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి కుమార్తె, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. కుమార్తెకు వివాహం జరిగింది. ధనలక్ష్మి మృతితో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది.

ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బంధువుల ఆందోళన

Advertisement
 
Advertisement
Advertisement