నిడదవోలు: జనసేన నాయకులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, తాను చనిపోతానంటూ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అదృశ్యమైన నిడదవోలు మండలం సింగవరం గ్రామానికి చెందిన టీడీపీ బూత్ ఇన్‌చార్జి కట్ట మణికంఠ శనివారం అమరావతిలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో ప్రత్యక్షమయ్యాడు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌పై ప్రసార మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు పెట్టాడని ఏప్రిల్ 24న జనసేన కార్యకర్తలు అచ్యుత పవన్‌కుమార్, అడ్డాల సాయి లక్ష్మణ్‌లు పట్టణ పోలీస్ స్టేషన్‌లో మణికంఠపై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మణికంఠను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి దర్యాప్తు చేస్తున్న క్రమంలో తట్టుకోలేక అతను చనిపోతున్నానంటూ ఈ నెల 3న సెల్ఫీ వీడియో పోస్టు చేశాడు. ‘నాన్న.. నన్ను క్షమించండి.. నేను చనిపోతున్నా.. నా వల్ల కావడం లేదు.. అక్రమ కేసులు నేను తట్టుకోలేకపోతున్నాను’ అంటూ అతను పోస్టు చేసి అదృశ్యమయ్యాడు. దీంతో సీఐ పీవీజీ తిలక్ మూడు బృందాలను ఏర్పాటు చేసి మణికంఠ ఆచూకీ కోసం గాలించారు. అనూహ్యంగా శనివారం అమరావతిలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణికి వినతిపత్రం ఇస్తున్న ఫొటో ప్రచార మాధ్యమాల్లో రావడం గమనార్హం. ప్రస్తుతం మణికంఠ విజయవాడలో ఉన్నట్టు పోలీసులు ధ్రువీకరించారు.


