సాగులో విత్తనం.. ఎంతో కీలకం | - | Sakshi
Sakshi News home page

సాగులో విత్తనం.. ఎంతో కీలకం

May 10 2026 8:16 AM | Updated on May 10 2026 8:16 AM

నేల స్వభావాన్ని బట్టి ఎంపిక చేసుకోవాలి

వ్యవసాయాధికారుల సూచనలు

కరప: రబీ వరి కోతలు దాదాపు పూర్తి కావడంతో ఖరీఫ్‌ సీజన్‌పై రైతులు దృష్టి సారించారు. ముందస్తు ఖరీఫ్‌ సాగు చేపడితే తొలకరి సీజన్‌ చివరిలో వచ్చే తుపాన్లు, అధిక వర్షాల నుంచి తప్పించుకుని పండిన పంటను దక్కించుకోవచ్చని వ్యవసాయాధికారులు రైతులను చైతన్యపరుస్తున్నారు. దీని వల్ల ఖరీఫ్‌, రబీపంట కాలం ముందుకు వచ్చి, రైతులకు అదనపు ఆదాయాన్ని సమకూర్చే మూడో పంటగా అపరాలు పండించుకోవచ్చన్నారు. సాగులో విత్తన ఎంపికే కీలకమని సూచిస్తున్నారు. అలాగే ఈ నెల 15వ తేదీనే పంట కాలువలకు సాగునీరు విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మరో ఐదు రోజుల్లో సాగునీరు విడుదల చేస్తుండటంతో రైతులు ఖరీఫ్‌ సాగుకు సమాయత్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో కరప మండల వ్యవసాయాధికారి ఇమ్మిడిశెట్టి సత్య సూచనలు చేశారు.

ఫ వరి నారుమడి నుంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మలచుకోవచ్చు. మంచి రకాల ఎంపిక, నారుమడి తయారీ, విత్తనశుద్ధి, ఎరువులు, పురుగుమందుల వాడకం, కలుపు నివారణలో యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా పాటించాలి.

ఫ సాధారణ పరిస్థితుల్లో నాటడానికి ఎంటీయూ 7029 (స్వర్ణ), స్వర్ణకు ప్రత్యామ్నాయంగా కొత్తగా రూపొందించిన ఎంటీయూ 1318 రకాన్ని వినియోగించుకోవచ్చు. పర్ర భూములు, పల్లపు ప్రాంతాలకు ఈ రకం అనువుగా ఉంటుంది. సన్న రకాలైన ఎంటీయూ 1282కు తక్కువ ఎరువులు వాడాలి. సన్నరకం సాంబమసూరికి ప్రత్యామ్నాయంగా ఎంటీయూ 1282 రకాన్ని సాగు చేసుకోవచ్చు. ఎంటీయూ 1318, ఎంటీయూ 1282 సాగు చివరిలో బ్యాక్టీరియా మూలంగా ఆకు ఎండు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రకాలకు యూరియా ఎక్కువగా వాడరాదు.

ఫ విత్తనం ద్వారా వ్యాప్తి చెందే కొన్ని రకాల తెగుళ్లను అరికట్టడానికి తప్పనిసరిగా విత్తనశుద్ధి చేయాలి. దీని కోసం సూడోమోనస్‌, కార్భండిజమ్‌ మందులను వినియోగించొచ్చు.

ఫ నాటే పద్ధతిలో ఒక ఎకరానికి 25 నుంచి 30 కిలోల విత్తనాలు, వెదజల్లు పద్ధతిలో ఒక ఎకరానికి 12 కిలోల విత్తనాలు సరిపోతాయి.

ఫ ధృఢమైన, ఆరోగ్యవంతమైన నారు పొందాలంటే నారుమడిని 12 రోజుల ముందు దమ్ముచేసి, చిన్న మడులుగా విభజించుకోవాలి. నీరు పెట్టడానికి, తొలగించడానికి వీలుగా పిల్ల కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి సెంటు భూమిలో ఐదు కిలోల వంతున విత్తనాలు చల్లుకోవాలి. విత్తనం ఎక్కువైతే నారు బలహీనంగా ఉండి, మాగుడు తెగులు సోకే అవకాశం ఉంది. ఎక్కువ విత్తనాలు పోస్తే నారు తీసేటప్పుడు వేర్లు తెగిపోయి సులువుగా రాదు. ఒక ఎకరానికి ఐదు సెంట్ల నారుమడి సరిపోతుంది. మొలక కట్టిన విత్తనాన్ని పలుచటి నీటి మీద చల్లుకోవాలి. నారు రెండు, మూడు ఆకులు తొడిగే వరకు ఆరుతడి పెడుతూ ఉండాలి. తర్వాత పలుచగా నీరుండేలా చూసుకోవాలి.

ఫ దమ్ములో ప్రతి ఐదు సెంట్ల నారుమడికి 2 కిలోల యూరియా, 7 కిలోల సింగిల్‌ సూఫర్‌ పాస్ఫేటు, 2 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ వేసుకోవాలి. విత్తిన రెండు వారాల తర్వాత మళ్లీ 2 కిలోల యూరియా పైపాటుగా వేయాలి. అవసరాన్నిబట్టి నారుమడిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.

Advertisement
 
Advertisement
Advertisement