ఫ అదే లూపస్ వ్యాధి
ఫ ముఖంపై సీతాకోక చిలుక ఆకారంలో దద్దుర్లు
ఫ ఇతర అవయవాలపై ప్రభావం
ఫ నేడు వరల్డ్ లూపస్ డే
రాయవరం: సాధారణంగా మనపై అనేక రోగాలు నిత్యం దాడి చేస్తుంటాయి. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని, తిప్పికొట్టడం మన శరీరంలోని రోగనిరోధక శక్తి ప్రధాన విధి. ఒక రకంగా చెప్పాలంటే శరీరానికి రక్షణ కవచం వంటిది. కానీ ఆ రక్షణ కవచమే వ్యతిరేక దిశలో పనిచేస్తే కొన్ని రోగాలు వస్తాయి. వాటిలో సిస్టమిక్ లూపస్ ఎరిథమాటోనస్ (ఎల్‌ఎస్‌ఈ) అనే వ్యాధి ఒకటి. దీన్ని లూపస్ వ్యాధి అని పిలుస్తారు. ఏటా మే 10న వరల్డ్ లూపస్ డేగా పాటిస్తున్నారు.
రోగ నిరోధక వ్యవస్థ దాడి
శరీరంలోని కణాలు, కణజాలంపై వ్యక్తి సొంత రోగనిరోధక వ్యవస్థ దాడి చేసినప్పుడు లూపస్ వ్యాధి అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల గుండె, ఊపిరితిత్తులు, చర్మం, కీళ్లు, మూత్రపిండాలు, రక్త నాళాలు, మెదడు వంటి వివిధ అవయవాలు, శరీర వ్యవస్థకు హాని జరుగుతుంది. ఈ వ్యాధి సిస్టమిక్ లూపస్ ఎరిథమాటోసస్, డిస్కోయిడ్ లూపస్, సబ్ అక్యూట్ క్యూటేనియస్ ల్యూపస్, డ్రగ్ ఇండ్యూసెడ్ లూపస్, నియోనెటాల్ లూపస్ అనే రకాలుగా ఉంటుంది. ఈ వ్యాధిని చాలా మంది తమ అవగాహన లోపంతో ముందుగా గుర్తించలేకపోతున్నారు. ఈ వ్యాధితో జిల్లాలోని రుమటాలజిస్టులు, జనరల్ ఫిజీషియన్లు, నెఫ్రాలజిస్టుల వద్దకు ప్రతి నెలా 80 నుంచి 100 మంది వరకు వస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో దాదాపు 3 వేల నుంచి 4 వేల మంది దాకా లూపస్ వ్యాధితో బాధపడుతున్నట్లు అంచనా.
లక్షణాలివే..
లూపస్ ఉన్న వారిలో ముఖంపై సీతాకోక చిలుక ఆకారంలో దద్దుర్లు వస్తాయి. కీళ్ల నొప్పులు, త్వరగా అలసిపోవడం, చాలా రోజులుగా జ్వరం, ఆకలి లేకపోవడం, జుట్టు రాలిపోవడం, గాఢంగా శ్వాస తీసుకున్నప్పుడు చాతీలో నొప్పి, చేతి, కాలివేళ్లు గోధుమరంగు, ఊదా రంగులోకి మారిపోవడం, నోటిలో పుండ్లు ఏర్పడటం జరుగుతుంది. కొందరిలో కిడ్నీ, గుండె, మెదడుపై కూడా ప్రభావం చూపుతుంది.
ఎలా వస్తుందంటే..
సాధారణంగా జీన్స్, పర్యావరణం (ఇన్ఫెక్షన్, కొన్ని రకాల మందులు, ఒత్తిడి, అధిక యువీ కిరణాలు) ప్రభావం వల్ల ఈ ఆటో ఇమ్యూన్ వ్యాధి వస్తుంది. ముఖ్యంగా 15 నుంచి 45 ఏళ్లలోపు (9:1 నిష్పత్తి) ఉన్న వారిలో కనిపిస్తుంది. వీరిలో ఈస్ట్రోజెన్ హార్మోన్ ప్రభావం వల్ల సహజంగానే ఇది వస్తుంది. చిన్న, పెద్ద తేడా లేకుండా ఈ వ్యాధి ఎవరికై నా రావచ్చు.


