అన్న పంచాయితీలో తమ్ముళ్ల లూటీలు! | - | Sakshi
Sakshi News home page

అన్న పంచాయితీలో తమ్ముళ్ల లూటీలు!

May 10 2026 7:52 AM | Updated on May 10 2026 7:52 AM

మిగిలిన నియోజకవర్గాలపై

సీఎం గుర్రు!

ఎమ్మెల్యేల భేటీలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రెండు నియోజకవర్గాలు మినహా మిగిలిన ఆరు నియోజకవర్గాల ఎమ్మెల్యేల పనితీరు దారుణంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయమై సీఎం చంద్రబాబు సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

● రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు మట్టి, మద్యం అక్రమ దందాలో భాగస్వామ్యం వహిస్తుండడంపై ఇంటెలిజెన్స్‌ నివేదికలు తెప్పించుకుని మరీ ప్రశ్నించినట్లు సమాచారం. పేకాట క్లబ్బు ఎవరు నిర్వహిస్తున్నారు..? ఎంత ఆర్జిస్తున్నారు..? అన్న విషయాలపై ఆ ఎమ్మెల్యే, బాబుకు మధ్య నిమిషాల పాటు చర్చ జరిగినట్లు తెలిసింది.

● అనపర్తి నియోజకవర్గంలో తన గెలుపులో కీలక పాత్ర పోషించిన అతని సామాజికవర్గాన్ని విస్మరిస్తున్నట్టు తెలిసింది. ఎప్పుడూ ఏదో ఒక వివాదం సృష్టించడం, కక్షసాధింపుగా ఇతర పార్టీల కార్యకర్తలపై కేసులు పెట్టిస్తున్న వైనం చంద్రబాబు వద్ద చర్చ జరిగినట్టు తెలిసింది.

● రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గంలో నేతలు భూ కబ్జాలకు వంత పాడుతున్నారన్న అంశంపై చర్చ జరిగినట్లు తెలిసింది. అంతేగాక ఇసుక అక్రమ రవాణాలో ఆయన అనుచరులు ఆరితేరిన ప్రస్తావన వచ్చినట్లు సమాచారం.

● కొవ్వూరు నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాలో అక్కడి నేతలు భారీగా ఆర్జిస్తున్నట్లు తెలిసింది. లారీకి ఇంత అని ధర నిర్ణయించి మరీ దండుకుంటున్న విషయమై చర్చ వచ్చినట్లు సమాచారం.

సాక్షి, రాజమహేంద్రవరం: సీఎం చంద్రబాబుతో నేతల భేటీ జనసేన, టీడీపీ నేతల మధ్య కుంపటి రాజేసిందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

రాజానగరం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన నేతల మధ్య మళ్లీ ముసలం పుట్టుకొచ్చింది. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్‌చార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి వర్గాల మధ్య విభేదాలు పొడసూపిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం చంద్రబాబుతో భేటీలో ఇవి మరింత బహిర్గతమయ్యాయి. ఒక్క రాజానగరం నియోజకవర్గంలోనే కాకుండా.. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.

చంద్రబాబు వద్దకు పేచీలు

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలు, టీడీపీ ఇన్‌చార్జిలతో విజయవాడలో సమావేశమయ్యారు. ఒక్కో ఎమ్మెల్యే పనితీరుపై ప్రత్యేకంగా ఆరా తీశారు. ఈ నేపథ్యంలో రాజానగరం నియోజకవర్గ నేతల భేటీ చర్చనీయాంశంగా మారింది. జిల్లా టీడీపీ అధ్యక్షుడు, రాజానగరం నియోజకవర్గ ఇన్‌చార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే తమకు, తన వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని, అధికారిక కార్యక్రమాల్లో, సంక్షేమ పథకాల ప్రచారంలోనూ తమను ఆహ్వానించడం లేదని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ విషయం ఎమ్మెల్యే బత్తులకు లీకై ంది. దీంతో ఆయన సైతం సీఎం వద్ద పంచాయతీ పెట్టినట్లు తెలిసింది. తాము వెంకటరమణ చౌదరికి ప్రాధాన్యం ఇస్తున్నామని, అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నా గంటల తరబడి ఆలస్యం చేస్తున్నారని, దీంతో ప్రజలు విసుగు చెందుతున్నారన్న విషయాన్ని చంద్రబాబుకు వివరించినట్టు తెలిసింది. ఇందుకు ఉదాహరణగా ఇటీవల రాజానగరం నియోజకవర్గంలో అన్న క్యాంటిన్‌ ప్రారంభోత్సవానికి ఆయన ఆలస్యంగా వచ్చిన విషయాన్ని ప్రస్తావించినట్టు సమాచారం. మరికొన్ని అంశాల్లో సైతం వెంకటరమణ వ్యవహరిస్తున్న తీరును బాబు ముందుంచినట్లు తెలిసింది. ఇలా ఒకరిపై మరొకరు పరస్పర ఫిర్యాదులు చేసుకున్న విషయం రాజానగరం నియోజకవర్గంలో హాట్‌ టాపిక్‌గా మారింది.

గతంలోనూ..

గాడాలలో కోలమూరుకు చెందిన ఓ టీడీపీ నేత లే అవుట్‌కు మట్టి తరలిస్తుండగా ఎమ్మెల్యే బత్తుల వర్గీయులు ఆ లారీలను అడ్డుకున్నారు. ఆ సందర్భంలో టీడీపీ, జనసేన నేతల మధ్య పెద్ద స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది.

అలాగే భవన నిర్మాణాలకు వినియోగించే రాయిని రాజమహేంద్రవరానికి చెందిన టీడీపీ నేతలు లారీల్లో అక్రమంగా తరలిస్తున్నారు. వే బిల్లులు లేవన్న కారణంతో రాయి తరలించే లారీలను బత్తుల అనుచరులు అడ్డుకున్న సందర్భాలు సైతం ఉన్నాయి.

కూటమిలో చిచ్చురేపుతున్న

నాయకుల విభేదాలు

ప్రాధాన్యమివ్వడం లేదని

పరస్పర ఆరోపణలు

ఇసుక, మట్టి, మద్యం దందాల్లో

పంపకాల పేచీ

రచ్చకెక్కిన బత్తుల, బొడ్డు విభేదాలు

Advertisement
 
Advertisement
Advertisement