● మామిడిలో రారాజు కొత్తపల్లి కొబ్బరి
● సామాన్యులకు అందని ధరతో ౖపైపెకి
● దిగుబడి తక్కువ.. గిరాకీ ఎక్కువ
● పిందె ప్రాయంలోనే బుక్కింగులు
● వంద కాయ రూ.5 వేల వరకు విక్రయం
పిఠాపురం: వేసవిలో ఫలరాజు మామిడి రుచి చూడనివారుండరు. మరీ ప్రత్యేకంగా కొత్తపల్లి కొబ్బరి, పండూరు మామిడి రకాలైతే కనీసం వాసన చూసినా చాలనేంత రుచి. కొత్తపల్లి నుంచి కొత్త ఢిల్లీ వరకు కొత్తపల్లి కొబ్బరి పేరు తెలియనివారు ఉండరు. మామిడి ఉత్పత్తుల్లో హిడెన్ జెమ్స్‌గా భావిస్తారు. ఏ గ్రామాల్లో ఇవి ఉత్పత్తి అయితే ఆ గ్రామం పేరుతో ప్రసిద్ధి చెందుతాయంటారు. పూర్వం ఆంధ్ర ప్రాంత రాజులు తమ తోటల్లో వీటి పెంపకం చేపట్టి మిత్రరాజులకు కానుకలుగా పంపేవారు. ఇప్పటికీ దేశాధినేతలకు, పై అధికారులకు మామిడిపండ్లను కానుకగా పంపడం మనకు తెలిసిందే. ఆవకాయ పెట్టుకోవాలన్న ఆలోచన రాగానే గృహిణులకు ముందుగా గుర్తొచ్చేది కొత్తపల్లి కొబ్బరే. పీచు ఎక్కువగా ఉండి, ఎక్కువ కాలం నిల్వ ఉండడం వల్ల దీనికి ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ప్రస్తుతం మార్కెట్‌లో వంద కాయలు రూ.3500 నుంచి రూ.ఐదు వేల వరకు పలుకుతున్నాయి.
ఈ రకం కాయలు, పళ్ల రంగు, రుచి, వాసన ఎంతో ప్రత్యేకం. వీటిలో ఫైబర్ అధికంగా ఉండడంతో పాటు కెరోటిన్, కాల్షియం, విటమిన్ ఎ, సి ఎక్కువగా ఉంటాయి. తొక్క పలుచగా ఉండి పీచు ఎక్కువగా ఉంటుంది. పులుపు ఎక్కువగా ఉండడం వల్ల పచ్చి మామిడి మామూలుగా తినలేరు. కాని పండు మాత్రం అతి మధురం.
కొత్తపల్లి కొబ్బరి మామిడి పళ్లు
కొత్తపల్లి కొబ్బరి మామిడి కాయలు
మామిడి కాయలు కోస్తున్న నాగేశ్వరరావు
35 ఏళ్లుగా వ్యాపారం
ఈ ఏడాది దిగుబడి సరిగా లేకపోయినా 35 ఏళ్లుగా ఈ వ్యాపారం చేస్తున్నా. కొబ్బరి మామిడి మన దరిదాపుల్లోనే ఎక్కడా లేదు. ఉలవపాడు నుంచి తెస్తున్నాం. కొబ్బరి మామిడి ఒక పరక (14 కాయల) ధర రూ.400 ఉంది. ఈ జిల్లాలో పండే కొత్తపల్లి కొబ్బరి మామి
డికి మంచి గిరాకీ ఉంది. – ఎ.శ్రీను మామిడి వ్యాపారి, పిఠాపురం
గిరాకీ ఎక్కువ
అత్యంత సువాసన భరితంగా ఉండే కొత్తపల్లి కొబ్బరి పళ్ల గిరాకీ మరే రకానికీ ఉండదంటే అతిశయోక్తి కాదు. ముందుగానే డబ్బులు ఇచ్చి ఆర్డర్లు బుక్‌చేసుకుంటారు. ప్యాకింగ్‌లు చేసి ఉంచేస్తే వారు తీసుకువెళ్తుంటారు. ఎక్కువ ధర పలికే ఈ కాయలు, పండ్లను రాజకీయ నాయకులు, అధికారులు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు.
– పెద్దిమూడి నాగేశ్వరరావు, మామిడి వ్యాపారీ, కొత్తపల్లి.


