● ఉమ్మడి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి దేవానంద్
● నూతన కోర్టు భవన
సముదాయాల ప్రారంభం
● హాజరైన హైకోర్టు ప్రధాన
న్యాయమూర్తి లిసా గిల్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): న్యాయ వ్యవస్థ సమర్ధంగా పనిచేయాలంటే బార్, బెంచ్ మధ్య సమన్వయం అవసరమని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ బట్టు దేవానంద్ అన్నారు. రాజమహేంద్రవరంలో నూతనంగా నిర్మించిన కోర్టు భవన సముదాయాల ప్రారంభోత్సవం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లిసా గిల్‌తో పాటు పలువురు న్యాయమూర్తులు హాజరయ్యారు. కోర్టులకు మౌలిక వసతులు కల్పించడం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల బాధ్యత అన్నారు. నూతన కోర్టుల భవన సముదాయం జిల్లా న్యాయ చరిత్రలో ఒక కీలక మైలురాయని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రిన్సిపల్, జిల్లా న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. జిల్లా కోర్టు 1802లో స్థాపించబడిందని, మద్రాస్ ప్రెసిడెన్సీలో ఏర్పాటైన తొలి న్యాయ సంస్థల్లో ఒకటన్నారు. 1802–09 మధ్య కాలంలో ఎల్.స్కిన్నర్ తొలి జిల్లా, సెషన్స్ జడ్జిగా పనిచేశారన్నారు. భారత తొలి ప్రధాన న్యాయమూర్తుల్లో ఒకరైన కోకా సుబ్బారావు రాజమహేంద్రవరం వాసేనని, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు ఇక్కడ న్యాయవాదిగా పనిచేశారన్నారు. జిల్లాలో ప్రస్తుతం 65 కోర్టులు ఉండగా, మొత్తం 87,922 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రాజమహేంద్రవరంలో 18 కోర్టులు ఉండి 23,173 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. 2008లో నాలుగు కోర్టుల నిర్మాణానికి పరిపాలన అనుమతులు లభించాయని, సవరణ అనుమతులు మంజూరు కాగా, 2012లో అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మదన్ బి.లోకూర్ శంకుస్థాపన చేశారన్నారు. జస్టిస్ రఘునందరావు మాట్లాడుతూ జిల్లాతో తనకు వ్యక్తిగత, చారిత్రక అనుబంధం ఉందని, తన పూర్వీకులు కడియం ప్రాంతానికి చెందినవారని, అక్కడ నర్సరీ ఉద్యమానికి ఆద్యులుగా నిలిచారన్నారు. జస్టిస్ బీవీఎల్‌ఎన్ చక్రవర్తి మాట్లాడుతూ తాను రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరం ప్రాంతంలో జన్మించానని, జీఎస్‌కే లా కళాశాలలో న్యాయ విద్య అభ్యసించానన్నారు. కాకినాడలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన సమయంలో అప్పీలు, బెయిల్ కేసుల కోసం తరచూ రాజమహేంద్రవరం కోర్టులకు వచ్చేవాడినన్నారు. జస్టిస్ న్యాపతి విజయ్ మాట్లాడుతూ ఈ భవన నిర్మాణంలో తలెత్తిన వివాదాలలో కాంట్రాక్టర్ తరఫున తాను హైకోర్టులో వాదించానని, అప్పట్లో పొందిన మధ్యంతర ఉత్తర్వులు చివరకు భవన నిర్మాణం పూర్తికి దోహదపడ్డాయన్నారు. రాజమండ్రి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్‌వీ.ప్రసాద్, జిల్లా జేసీ వై.మేఘా స్వరూప్, ఎస్పీ డి.నరసింహకిశోర్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, న్యాయ మూర్తులు, న్యాయ వాదులు, బార్ సభ్యులు పాల్గొన్నారు.


