కార్పెట్లు ఎక్కడ స్వామీ? | - | Sakshi
Sakshi News home page

కార్పెట్లు ఎక్కడ స్వామీ?

May 10 2026 7:52 AM | Updated on May 10 2026 7:52 AM

అన్నవరం: ఎండలు మండి భక్తుల కాళ్లు కాలిపోతున్నా అన్నవరం దేవస్థానం అధికారులకు కార్పెట్లు పరచాలన్న తలంపు రాకపోవడం శోచనీయం. శనివారం సుమారు 50 వేల మంది భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చి ఆలయ ప్రాంగణంలో నడిచేందుకు తీవ్ర ఇబ్బంది పడ్డారు. పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో వందల సంఖ్యలో నవ దంపతులు వారి బంధు మిత్రులు వస్తున్నారు. చలువ పందిళ్లు ఉన్నప్పటికీ అవి లేని చోట నడవడానికి వారు అవస్థ పడుతున్నారు. అధికారులు గత మార్చి నెలలో పది ఫుట్‌ కార్పెట్‌ బండిళ్లు కొనుగోలు చేశారు. భక్తుల అవస్థలపై గత నెల 8న ‘కాళ్లు కాలుతున్నా కార్పెట్లు తీయరా’ పేరుతో కథనం ప్రచురించగా ఆ నెల 12న మంత్రి ఆనం పర్యటన సందర్భంగా వాటిని పరిచారు. దీంతో ఆ తరువాత రోజు 13వ తేదీన ‘ఆనందంగా పరిచేశారు’ కథనాలు ‘సాక్షి’లో ప్రచురితమయ్యాయి. ఆ తరువాత కొన్ని రోజులు వాటిని ఉంచినప్పటికీ నాలుగు రోజులుగా అవి కనిపించడం లేదు. భక్తులు పశ్చిమ రాజగోపురం వెలుపలకు వచ్చేటప్పటికి నేల వేడెక్కి ఉంటుంది. దీంతో వారు కాలు పెట్టలేని పరిస్థితి ఉంటుంది. రాజగోపురం నుంచి అన్నదాన పథకానికి వెళ్లాలంటే తారు రోడ్‌ మీద నడవాల్సి ఉంది. దీనిపై భక్తులు నడిచేందుకు వీలుగా తెల్ల పెయింట్‌ వేసినా నాలుగు రోజులకే ఆ అది వెలిసిపోయి మళ్లీ ఇబ్బందిగా మారుతోంది. పశ్చిమ రాజగోపురం నుంచి అన్నదాన భవనం వరకు, దేవస్థానం బస్సులు ఆగే విశ్రాంతి షెడ్డు వరకు కార్పెట్‌ వేస్తే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందని భక్తులు అంటున్నారు.

నాన్నమ్మకు తలకొరివి

పెట్టిన మనవరాలు

రాజోలు: ఓ మనవరాలు తన నానమ్మకు తలకొరివి పెట్టి రుణం తీర్చుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజోలు సుందరమ్మ చెరువు గట్టు ప్రాంతానికి చెందిన గాలిదేవర సత్యవేణి (75) కిడ్నీ సమస్యతో బాధపడుతూ మృతి చెందింది. సత్యవేణికి ఒక్కగానొక్క కుమారుడు శ్రీనివాసరావు 2021లో కరోనాతో మృతి చెందాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహమై వేరొక ప్రాంతంలో నివాసం ఉంటోంది. నాన్నమ్మ సత్యవేణి ఆలనాపాలనా చిన్న మనుమరాలైన గాలిదేవర రేణుక చూసుకుంటోంది. దీంతో శనివారం రాజోలు కై లాసభూమిలో నానమ్మకు తలకొరివి పెట్టింది. ఈ సందర్భంగా రేణుక మాట్లాడుతూ తన తండ్రి శ్రీనివాసరావు కరోనాతో చనిపోయినప్పుడు అంత్యక్రియలు నిస్సహాయ స్థితిలో జరిగాయని, కనీసం మృతదేహాన్ని చివరిచూపు చూసేందుకు కూడా నోచుకోలేకపోయామని విలపించింది. నానమ్మ సత్యవేణికి తలకొరివి పెట్టి పితృరుణం తీర్చుకున్నానని కన్నీటి పర్యంతమైంది.

కాళ్లు కాలి అవస్థలు పడుతున్న భక్తులు

మంత్రి ఆనం పర్యటనలో

పరిచి మళ్లీ మూలకు చేర్చిన అధికారులు

Advertisement
 
Advertisement
Advertisement