చెప్పింది చేయడమే ప్రత్యేకం! | - | Sakshi
Sakshi News home page

చెప్పింది చేయడమే ప్రత్యేకం!

May 9 2026 7:38 AM | Updated on May 9 2026 7:38 AM

సాక్షి, రాజమహేంద్రవరం: పంచాయతీల్లో ప్రభుత్వం నియమించిన ప్రత్యేకాధికారులు ఉత్సవ విగ్రహాల్లా మారారు. కూటమి నేతలు వారిపై ఒత్తిడి తెచ్చి అన్ని పనులూ చక్కబెట్టేస్తున్నారు. ఈ ప్రభావం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై పడుతోంది. పంచాయతీల పదవీకాలం ఏప్రిల్‌ 2వ తేదీ నాటికి ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన సాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జిల్లాలో 343 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 322 మంది ప్రత్యేకాధికారులను నియమిస్తూ కలెక్టర్‌ కీర్తి చేకూరి ఉత్తర్వులు వెలువరించారు. తహసీల్దార్లు, ఎంపీడీఓ, ఎంఈఓ, ఏఓ, మత్స్యశాఖ అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. అధికారుల కొరత కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఏపీఎంలకు సైతం బాధ్యతలు ఇచ్చారు. పంచాయతీలు ఎక్కువగా ఉండటం అందుకు తగ్గట్టు అధికారులు లేకపోవడంతో సీనియర్‌ అధికారులకు రెండు నుంచి మూడు, మరికొందరికి ఐదు పంచాయతీల బాధ్యతలు అప్పగించారు.

త్రీమెన్‌ కమిటీ పెత్తనం

గ్రామ పంచాయతీ పరిధిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కలిసి త్రీమెన్‌ కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఆ కమిటీ కనుసన్నల్లోనే పంచాయతీ పాలన సాగుతోంది. కూటమి కమిటీ సూచించిన అభివృద్ధి పనులు, తాము చెప్పిన వాటికే సంతకాలు చేయాలంటూ అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. తమ అంగీకారం లేనిదే రూపాయి కూడా ఖర్చు చేయకూడదంటూ హుకుం జారీ చేస్తున్నారు. రూల్‌ ప్రకారం వెళతామంటున్న అధికారులపై బెదిరింపులకు దిగుతున్నారు. కాదూ కూడదంటే బదిలీ చేయిస్తామంటూ హెచ్చరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ కావడం.. ఆపై ఎందుకొచ్చిన గొడవలే అంటూ అధికారులు మిన్నకుంటున్నారు.

అధికారులకు ప్రత్యేక అధికారాలు కేటాయించిన ప్రభుత్వం.. వారికి పవర్‌ లేకుండా చేసింది. ప్రత్యేక బాధ్యతలు స్వీకరించి రెండు మాసాలు గడిచినా నేటికీ నిధులు డ్రా చేసే అధికారం కల్పించలేదు. వెరసి గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు నానా పాట్లు పడుతున్నారు. వీధి దీపాలు, తాగునీటి సరఫరా, పారిశుధ్యం తదితర పనులు చేపట్టాల్సి ఉంది. అత్యవసర పరిస్థితుల్లో చేతిపంపుల మరమ్మతులు, తాగునీటి ట్యాంకులు, గ్రామీణ నీటి సరఫరా పనులు చేపట్టాల్సి ఉంది. ప్రభుత్వం నిధులు ఖర్చు చేసే అధికారం ఇవ్వకపోవడంతో అత్యవసర పనులకు ఆటంకం ఏర్పడుతోంది. చేసేది లేక అధికారులు తమ సొంత డబ్బు వెచ్చిస్తున్నారు. ఇలా ప్రతి అధికారి ఇప్పటి వరకు రెండు నెలలుగా ఒక్కో అధికారి రూ.లక్ష వరకు సొంత డబ్బు వెచ్చించినట్లు సమాచారం.

డ్రాయింగ్‌ పవర్‌ లెస్‌

ప్రత్యేక అధికారులకు డ్రాయింగ్‌ పవర్‌ తప్పనిసరి. బిల్లులపై సంతకాలతో పాటు స్టాంప్‌ తదితర ధ్రువీకరణలు చేయాలి. అనంతరం ఆన్‌లైన్‌లో వేలిముద్ర వేస్తేనే బిల్లులు విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ప్రత్యేకాధికారుల నుంచి వేలిముద్ర అథారిటీ అనుమతుల కోసం మండల పరిషత్‌ అధికారులు ఇటీవల ఆధార్‌, ఆధార్‌తో లింకై న మొబైల్‌ నంబర్‌ వివరాలు సేకరించారు. నేటికీ ప్రత్యేక అధికారులకు నిధులు డ్రా చేసే అధికారం రాలేదు. ఎప్పటికి వస్తుందో తెలియని పరిస్థితి. ఆ అధికారం వస్తే తప్ప 15వ ఆర్థిక సంఘం నిధులు డ్రా చేయడం, బిల్లులు చెల్లించడం సాధ్యం కాదు.

ప్రజాసేవల్లో జాప్యం

ప్రత్యేకాధికారులు తమ సొంత శాఖకు సంబంధించిన విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అదనంగా పల్లె పాలనపై దృష్టి పెట్టాలి. ఈ పరిణామం అధికారుల పనితీరుపై పడనుంది. గ్రామ పంచాయతీల్లో విద్యుత్‌, తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు వంటి సమస్యలు పరిష్కరించడానికి అధికారులు అందుబాటులో ఉండరు. దీంతో ఆయా సమస్యల పరిష్కారంలో జాప్యం చోటు చేసుకుంటుందని ప్రజలు అంటున్నారు.

ఉత్సవ విగ్రహాల్లా మారిన

పంచాయతీల ప్రత్యేకాధికారులు

చెక్‌ పవర్‌ ఇవ్వకపోవడంతో ఆర్థిక అవస్థలు

కూటమి నేతలు చెప్పినట్టు

వినాల్సిందేనంటూ హుకుం

తమ సొంత డబ్బు వెచ్చించి

చిన్నపాటి పనులు చేస్తున్న వైనం

ఇప్పటి వరకు ఒక్కో అధికారి

రూ.లక్షకు పైగా ఖర్చు

Advertisement
 
Advertisement
Advertisement