● ఇంకా ప్రారంభంకాని కొనుగోళ్లు
● రైతుల ఆందోళన
● తొర్రేడులో బ్లాక్ సాయిల్ టొబాకో సాగు
● 3 మిలియన్ల కిలోల ఉత్పత్తి
దేవరపల్లి: ఈ ఏడాది పొగాకు పండించిన రైతుల పరిస్థితి గందరగోళంగా మారింది. నల్లరేగడి భూముల్లో పండించిన పొగాకు విక్రయాలకు బోర్డు నుంచి ఇంతవరకు అనుమతులు రాలేదు. టొబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని దేవరపల్లి వేలం కేంద్రం పరిధిలో సుమారు 30 గ్రామాల్లో 964 బ్యారన్లకు లైసెన్సులు ఉండగా, 1,013 మంది రైతులు 1,120 హెక్టార్లలో బ్లాక్ సాయిల్ పొగాకు పండిస్తున్నారు. 2025–26 పంట కాలానికి 2.03 మిలియన్ల కిలోలు ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా, 3 మిలియన్ల కిలోలు ఉత్పత్తి జరిగింది. పొగాకు క్యూరింగ్‌లు, గ్రేడింగ్‌లు పూర్తి చేసిన రైతులు పంటను అమ్ముకోవడానికి ఎదురు చూస్తున్నారు. రాజమహేంద్రవరం డివిజన్‌లో తొర్రేడు, రంగంపేట, సీతానగరం, ముగ్గళ్ల, వడిశలేరు ప్రాంతాల్లో నల్లరేగడి భూముల్లో పొగాకు పండిస్తున్నారు. దేవరపల్లి వేలం కేంద్రం పరిధిలోని దేవరపల్లి మండలంలో దేవరపల్లి, పల్లంట్ల, లక్ష్మీపురం, బందపురం, దుద్దుకూరు గ్రామాల పరిధిలో కొంత మంది నల్లరేగడి భూముల్లో పొగాకు పండిస్తున్నారు. నల్లరేగడి భూముల్లో పండించిన పొగాకును దేవరపల్లి వేలం కేంద్రంలో రైతులు విక్రయించవలసి ఉంది. గతంలో తొర్రేడు వేలం కేంద్రంలో బ్లాక్ సాయిల్ రైతులు పొగాకును విక్రయించేవారు. వేలం కేంద్రాన్ని పొగాకు బోర్డు మూసివేయడంతో అక్కడ బ్యారన్లను దేవరపల్లి వేలం కేంద్రానికి బదిలీ చేశారు. దాదాపు 10 సంవత్సరాలుగా అక్కడ రైతులు పండించిన పొగాకును దేవరపల్లి వేలం కేంద్రంలో విక్రయిస్తున్నారు. బ్లాక్ సాయిల్(బీఎస్) పొగాకును వేలం కేంద్రంలో ప్రత్యేకంగా ఉంచి అధికారులు వేలం నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 25న రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు ప్రారంభించారు. వర్జీనియా పొగాకును మాత్రమే వేలం నిర్వహిస్తున్నారు. బ్లాక్ సాయిల్ పొగాకు కొనుగోలుకు బోర్డు నుంచి అనుమతులు రాలేదని అధికారులు చెబుతున్నారు.
మొక్కుబడిగా వర్జీనియా కొనుగోళ్లు
వర్జీనియా పొగాకు కొనుగోళ్లు కూడా మొక్కుబడిగా జరుగుతున్నాయి. 40 రోజులు వేలం నిర్వహించగా సుమారు 11 లక్షల కిలోల పొగాకు విక్రయం జరిగింది. వేలం కేంద్రాలకు వచ్చిన బేళ్లలో 50 నుంచి 60 శాతం అమ్ముడు పోక రైతులు ఇబ్బంది పడుతున్నారు. కిలో గరిష్ట ధర రూ.265 పలకడంతో పంటను అమ్ముకోవడానికి రైతులు ముందుకు రావడంలేదు. సుమారు 25 కంపెనీల ప్రతినిధులు వేలంలో పాల్గొనవలసి ఉండగా, ఆరు కంపెనీలు వేలంలో పాల్గొంటున్నాయి. ఈ ఏడాది పొగాకు కొనుగోళ్లను చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు. బోర్డు అనుమతి మేరకు పండించిన పంటను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి ఆదుకోవాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు. 2015–16 సంవత్సరంలో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో గిట్టుబాటు ధర రాక అనేక మంది పొగాకు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, అటువంటి ఘటనలు ఈ ఏడాది పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రైతులకు అండగా ఈ నెల 6వ తేదీన దేవరపల్లి వేలం కేంద్రం వద్ద వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన సంగతి తెలిసిందే.
కస్టమర్స్ నుంచి ఆర్డర్లు రావాలి
విదేశీ కస్టమర్స్ నుంచి ఎగుమతి ఆర్డర్లు రావలసి ఉంది. లక్ష కిలోల పొగాకు ఐటీసీ శాంపిల్స్ తీసి కస్టమర్లకు పంపించింది. శాంపిల్స్ పొగాకు కస్టమర్లకు నచ్చకపోవడంతో రెండవ సారి పంపిస్తున్నారు. త్వరలో ఆర్డర్లు వస్తాయని ఆశిస్తున్నాం. బ్లాక్ సాయిల్ పొగాకుకు ఇండెంట్ రావలసి ఉంది. ఎన్‌ఎల్‌ఎస్ ప్రాంతంలో 50.87 మిలియన్ల కిలోల ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇవ్వగా, 85.25 మిలియన్ల కిలోలు ఉత్పత్తి జరిగింది.
– జె.సురేంద్ర కుమార్, టొబాకో బోర్డు
రీజనల్ మేనేజరు, రాజమహేంద్రవరం
పల్లంట్లలో నల్లరేగడి భూముల్లో సాగు చేస్తున్న పొగాకు


