ప్రశాంతంగా ఈడీ సెట్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ఈడీ సెట్‌

May 9 2026 7:38 AM | Updated on May 9 2026 7:38 AM

రాజానగరం: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఎంపిక చేసిన 16 కేంద్రాలలో శుక్రవారం నిర్వహించిన ఏపీ ఈడీసెట్‌ 2026 ప్రశాంత వాతావరణంలో జరిగిందని ప్రాంతీయ సమన్వయకర్త, ఆదికవి నన్నయ యూనివర్సిటీ బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.సుబ్బారావు తెలిపారు. 4,622 మంది పరీక్ష రాసేందుకు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. అయితే పరీక్షకు హాజరైంది మాత్రం 3,629 మంది (78.5శాతం). వీరిలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఏడు కేంద్రాలలో 2,609 మందికిగాను 2,137 మంది (81.9శాతం), పశ్చిమ గోదావరి జిల్లాలోని తొమ్మిది కేంద్రాలలో 2,013 మందికిగాను 1,492 మంది (74.1శాతం) పరీక్షకు హాజరయ్యారన్నారు.

ఆగస్టులో ప్రత్యేక లోక్‌ అదాలత్‌

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌): సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘‘సమాధాన్‌ సమరోహ్‌’’ కార్యక్రమంలో భాగంగా సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న రాజీకి అనుకూలమైన కేసులను పరస్పర అవగాహనతో పరిష్కరించడానికి ఆగస్టు 21, 22, 23 తేదీలలో ప్రత్యేక లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత శుక్రవారం ప్రకటనలో తెలిపారు. న్యాయవాదులు, కక్షిదారులు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని తమ కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకోవాలని సూచించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కక్షిదారులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవలసిందిగా కోరారు. 011–23116464, 011–23116465 హెల్ప్‌లైన్‌ నంబర్లలో సంప్రదించవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు.

రత్నగిరిపై పెళ్లి సందడి

అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధి శుక్రవారం రాత్రి పెళ్లి బృందాలతో నిండిపోయింది. ఎటు చూసినా వధూవరులు, వారి బంధుమిత్రులు, వివాహాలు చేయించే పురోహితులు, సన్నాయి మేళం వారు ఇలా అంతా పెళ్లిళ్లకు సంబంధించిన వారే దర్శనమిచ్చారు. శుక్రవారం రాత్రి ఏడు గంటల ముహూర్తంలో 150కి పైగా వివాహాలు జరిగాయి. ఈ వివాహాల నిర్వహణ కోసం సత్యగిరిపై నిర్మించిన 36 వివాహ హాల్స్‌, వివిధ సత్రాలలో వివాహాలు చేసుకునే స్థలాలు, రామాలయం వద్ద గల విశ్రాంతి షెడ్డు, దాని పక్కనే గల ఖాళీ ప్రదేశం అంతా పెళ్లి సందడి కనిపించింది. సత్యగిరిపై గల మట్టేవారి ఉచిత ఏసీ కల్యాణ మండపం, ఎంఎస్‌ రెడ్డి వివాహ వేదికలోని 24 చిన్న కల్యాణ మండపాల్లో కూడా ఇదే ముహూర్తంలో వివాహాలు జరిగాయి. వివాహ బృందాల వారి తాకిడితో సాధారణ భక్తులకు సత్రాలలో గదులు లభ్యం కాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement