వైకల్యం నుంచి వికాసం వైపు.. | - | Sakshi
Sakshi News home page

వైకల్యం నుంచి వికాసం వైపు..

May 9 2026 7:38 AM | Updated on May 9 2026 7:38 AM

ప్రత్యేక అవసరాలు గల చిన్నారుల సర్వే

కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో

భవిత కేంద్రాలు

చురుగ్గా సాగుతున్న నమోదు ప్రక్రియ

కపిలేశ్వరపురం: శారీరక వైకల్యం ఉన్న వారు మానసికంగా కుంగిపోకుండా జీవితంపై ఆశ, భవిత బంగారమనే నమ్మకాన్ని కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భవిత కేంద్రాలను నిర్వహిస్తోంది. ప్రత్యేక అవసరాలు గల చిన్నారులను వాటిలో చేర్పించేందుకు జూన్‌ 9వ తేదీ వరకూ సర్వే నిర్వహిస్తోంది.

ఉమ్మడి జిల్లాలో ఇలా..

తూర్పుగోదావరి జిల్లాలో 22, అంబేడ్కర్‌ కోనసీమ 19, కాకినాడ 22, పోలవరం జిల్లాలో 11 మొత్తంగా 74 భవిత కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో ఇద్దరు ఐఈఆర్పీలు, ఓక కేర్‌ వింగ్‌ వలంటీర్‌, వారానికోసారి సందర్శించే ఫిజియో థెరపిస్ట్‌ సేవలందిస్తారు. ఉమ్మడి జిల్లాలో 146 మంది ఇన్‌క్లూజివ్‌ ఎడ్యుకేషన్‌ రిసోర్స్‌ పర్సన్‌ (ఐఈఆర్పీలు), 73 మంది ఆయాలు (కేర్‌వింగ్‌ వలంటీర్లు) ఆయా కేంద్రాల్లో సేవలు అందిస్తున్నారు.

లక్ష్యమిదీ..

ప్రత్యేక అవసరాలు గల చిన్నారులు ఇంటికే పరిమితం కాకుండా వారిని మానసికంగా, శారీరకంగా బలోపేతం చేసి భవిష్యత్తు తమదే అని భావించే లక్ష్యంతో ఆయా కేంద్రాలు సాగుతున్నాయి. 0 నుంచి 18 ఏళ్లలోపు చిన్నారులకు ప్రత్యేక పరికరాల సాయంతో విద్యా బుద్ధులు చెబుతారు. వారికి ప్రత్యేక సౌకర్యాలు, రాయితీలు కల్పిస్తారు.

సిబ్బంది కార్యాచరణ ఇదీ

ఆరేళ్ల లోపు చిన్నారులకు ఈ కేంద్రాల్లో సేవలందిస్తారు. 6–18 చిన్నారులను పాఠశాలలో చేర్పించి విద్యా బుద్ధులు నేర్పుతారు. వారికి మధ్యాహ్న భోజనం ఇస్తారు. కేంద్రాలకు రాలేనివారికి గృహ ఆధారిత విద్యను అందిస్తారు. సమస్య తీవ్రతను బట్టి ప్రత్యేక వ్యాయామాలు, స్పీచ్‌, బిహేవియర్‌ థెరపీ చేస్తారు. ఇందుకు తగ్గ పరికరాలు ఆయా కేంద్రాల్లో ఉంటాయి.

ఆర్థిక చేయూత ఇలా..

కండరాల బలహీనత, అంధత్వం, మానసిక వైకల్యం, వినికిడి లోపం, ఆటిజం ఉన్న విద్యార్థులకు నెలకు రూ.600 చొప్పున 10 నెలలకు రూ.ఆరు వేలు లబ్ధిదారు ఖాతాలో ఎస్కార్ట్‌ భత్యం కింద జమ చేస్తారు. తీవ్రమైన వైకల్యం ఉన్న ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు గృహ ఆధారిత విద్యను అందించి నెలకు రూ.300 చొప్పున 10 నెలలకు రూ.3 వేలు జమ చేస్తారు. సీడబ్ల్యూఎస్‌ఎన్‌ బాలికల కోసం అదనంగా నెలకు రూ.200 చొప్పున 10 నెలలకు రూ.2వేలు ఖాతాలో జమ చేస్తారు.

ప్రస్తుత ప్రాజెక్ట్‌ లక్ష్యమిదీ

2026–27 విద్యా సంవత్సరానికి ఆయా విద్యార్థుల వివరాలు సేకరించి దృష్టి పోర్టల్‌లో నమోదుచేయడం లక్ష్యంగా ప్రత్యేక ప్రాజెక్టు సాగుతోంది. భవిత, నాన్‌ భవిత కేంద్రాల్లోని ఐఈఆర్‌పీలకు ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి శిక్షణ ఇస్తోంది.

సమస్యలతో సిబ్బంది సతమతం

సమగ్ర శిక్ష పరిధిలోని తమను రెగ్యులర్‌ చేయాలని ప్రభుత్వాన్ని రెండేళ్లుగా కోరుతున్నారు. సమాన పనికి సమాన వేతనం, ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరి గ్రాట్యుటీ, పీఎఫ్‌, ఈఎస్‌ఐ కల్పించాలన్న వారి డిమాండ్లను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. యువగళం పాదయాత్రలో ఈ మేరకు ఇచ్చిన హామీని ప్రభుత్వం విస్మరించింది. ఈ నెల 15న విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి మంత్రి లోకేష్‌ ఇంటి వరకూ పాదయాత్రకు ఉపక్రమించినట్టు రాష్ట్ర కాంట్రాక్ట్‌ అండ్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఫెడరేషన్‌ కార్యవర్గ సభ్యులు నూకపెయ్యి గంగాధర్‌ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement