● రక్షణ చర్యలు తీసుకోకుంటే ప్రమాదం
● జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి విజయరెడ్డి
అమలాపురం టౌన్: వేసవి ఎండల తాపం నుంచి మూగ జీవాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటిని వేసవి తాపం నుంచి వాటిని కాపాడేందుకు జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఎల్.విజయరెడ్డి ఐదు సూత్రాలు చెప్తున్నారు. జిల్లాలో 55, 221 ఆవులు, 1,10,123 గేదెలు, 25,291 గొర్రెలు, 19,713 మేకలు, 49,38,269 కోళ్లు (పౌల్ట్రీ) ఉన్నాయి. ఎండల తీవ్రత నుంచి వాటికి ఉపశమనం కలిగించేందుకు శుభ్రమైన చల్లని నీరు 24 గంటలూ అందుబాటులో ఉంచాలని చెప్తున్నారు.
పశువు రోజుకు 100 లీటర్ల వరకూ నీరు తాగుతుంది. అలాగే వాటికి నీడ ఏర్పాటు చేయాలి. పశువుల పాకలపై గడ్డి, టార్పాలిన్, షేడ్ నెట్ వేయాలి. ఎండ సమయంలో పశువులకు జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది. ఉదయం 6 నుంచి 9 గంటల వరకూ, సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల లోపు మాత్రమే మేత, దాణా వేయాలి. దాణాలో 30 గ్రాముల ఉప్పు, 50 గ్రాముల మినరల్ మిక్స్చర్ కలిపాలి. ఈ విధానం వల్ల పశువులు వడ దెబ్బ తగలకుండా ఉంటాయి.
వడ దెబ్బ లక్షణాలివీ..
పశువులు వడ దెబ్బ తగలకుండా రైతులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వాటిని గమనిస్తూ ఉండాలి. వాటికి ఆయాసం, జొల్లు, నాలుక బయట పెట్టడం, మేత మానేయడం వంటి లక్షణాలు గమినిస్తే తక్షణమే స్పందించాలి. వాటిని నీడకు చేర్చి వాటి శరీరంపై నీళ్లు పోయాలి. తక్షణమే పశువుల అంబులెన్స్ 1962 నెంబర్‌కు కాల్ చేయడం లేదా దగ్గరలో ఉన్న పశు వైద్యుడిని సంప్రదించడమో చేయాలి. ఈ జాగ్రత్తలను విధిగా పాటిస్తూ పాల దిగుబడి తగ్గకుండా, ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తతతో చూసుకోవాల్సిన రైతులపై ఉందని విజయరెడ్డి సూచిస్తున్నారు.


