● సామాజిక సేవల్లో ఆదర్శం
● రక్తదానంతో ప్రాణదానం
● నేడు ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం
రాయవరం: ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకోవడంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ముందుంటుంది. బాధితుల ప్రాణాలను కాపాడేందుకు రక్తదానంతో పాటు ఇతర సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1928లో ఆ సంస్థ సేవలు ప్రారంభమయ్యాయి. దాతల నుంచి సేకరించిన రక్తం యూనిట్లను జిల్లాలోని రక్తనిధి కేంద్రాలు, రక్త నిల్వ కేంద్రాల ద్వారా వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాధితులకు అందజేస్తూ వారికి ప్రాణదానం చేస్తోంది. శుక్రవారం రెడ్‌క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కథనం..
వేలాది రక్తదాన శిబిరాలు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 120 మంది తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉచితంగా రక్తాన్ని సరఫరా చేస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 77 రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి 6,708 యూనిట్ల రక్తాన్ని సేకరించింది. 11,598 యూనిట్ల రక్తాన్ని అవసరమైన వారికి అందజేసింది. ఈ ఏడాది జెల్ టెక్నాలజీని ప్రవేశ పెట్టింది. దీని ద్వారా శుద్ధి చేసిన, నాణ్యమైన రక్తాన్ని రోగికి అందిస్తారు.
ఇతర సేవా కార్యక్రమాలు
రెడ్‌క్రాస్ సంస్థ దివ్యాంగుల ఆశ్రమ పాఠశాలను కాకినాడ ప్రతాప్‌నగర్‌లో నిర్వహిస్తోంది. ఇక్కడ ఉచిత వసతి విద్యాబోధనతో పాటు పుస్తకాలు, దుస్తులు అందజేస్తోంది. ప్రకృతి వైపరీత్యాల వేళ బాధితులకు వైద్యంతో పాటు నిత్యావసర వస్తువులు అందిస్తోంది. రాజా ట్యాంకు వద్ద యోగా సెంటర్‌ను నిర్వహిస్తోంది. నామమాత్రపు చార్జీలతో వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. వాకలపూడిలో ఉన్న ఆశ్రమంలో 25 మంది ఉన్నారు. గ్రీన్‌ఫీల్డ్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ బ్లైండ్‌లో 40 మంది బోధిస్తున్నారు. అనాథ శవాలకు దహన సంస్కారాలను ఆత్మబంధువు పేరుతో నిర్వహిస్తున్నారు. ఉచిత అంబులెన్స్ అందిస్తోంది. సంస్థ కార్యాలయంలో రోజూ ఉదయం, సాయంత్రం 50 మందికి ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు. ఏటా ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తోంది.
సేవలకు పురస్కారం
తూర్పుగోదావరి జిల్లా శాఖ అందించిన సేవలకు పలు అవార్డులు సొంతం చేసుకుంది. గవర్నర్ చేతుల మీదుగా పురస్కారాలను, ప్రశంసాపత్రాలను అందుకుంది.
చాలా సంతోషంగా ఉంది
రెడ్‌క్రాస్ సంస్థలో సేవచేయడం సంతోషంగా ఉంది. రక్తదానంపై అవగాహన పెంచడానికి కృషి చేస్తున్నాం.
– కసిరెడ్డి శివకుమార్, సెక్రటరీ,
ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, కాకినాడ
వలంటీర్లను సిద్ధం చేస్తున్నాం
బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. పుష్కరాల్లో సేవలందించేందుకు వలంటీర్లను సిద్ధం చేస్తున్నాం.
– తరుణ్ గోగినేని, చైర్మన్, రెడ్‌క్రాస్ సంస్థ, తూర్పుగోదావరి జిల్లా


