● హాకీ వేసవి శిక్షణ శిబిరంలో
ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు
● ఈ తర్ఫీదును తమ లక్ష్య సాధనకు
వినియోగించుకుంటామని స్పష్టీకరణ
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): చక్కని కార్యాచరణతో వేసవి సెలవులను సద్వినియోగం చేసుకొనేందుకు ఆ విద్యార్థులు సిద్ధమయ్యారు. ఆట విడుపు వేళ తమ లైఫ్ గోల్ సాధనకు శ్రమించాలని నిర్ణయించుకున్నారు. భవిష్యత్తులో తాము ఎలా ఎదగాలనుకుంటున్నామో, జీవితంలో ఏ విధంగా స్థిరపడాలనుకుంటున్నామో ముందుగానే నిర్ణయించుకొన్న.. వారు తమ లక్ష్యసాధనకు శిక్షణ పొందడానికి సమాయత్తమయ్యారు.
కాకినాడ పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న హాకీ వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో పాల్గొన్న విద్యార్థులు తమ అభిప్రాయాలు ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు..
అంకితభావంతో రాణింపు
ఆటల్లో రాణించాలంటే అంకిత భావం, కృషి, పట్టుదల అవసరం. 1987లో ఇదే కళాశాలలో చదివే రోజుల్లో వెయిట్ లిఫ్టింగ్‌లో ఆలిండియా గోల్డ్ మెడల్ సాధించా. అప్పటి ప్రిన్సిపాల్ ధర్మారావు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి అభినందించారన్నారు. ఆ ప్రోత్సాహంతోనే వెయిట్ లిఫ్టింగ్ కోచ్‌గా కెరీర్ ప్రారంభించి, ఇప్పుడు డీఎస్‌డీఓ విధులు నిర్వహిస్తున్నా. 2013లో డీఎస్‌ఏలో వెయిట్ లిఫ్టింగ్ శిక్షణకు వచ్చిన ధాత్రి ఇప్పుడు ఇండియన్ రైల్వేస్‌లో గ్రేడ్–2 ఉద్యోగినిగా పనిచేస్తోంది. ఆటల్లో రాణించాలంటే క్రమం తప్పకుండా శిక్షణకు హాజరు కావాలి.
– వి.సతీష్‌కుమార్, డీఎస్‌డీఓ


