బరి తెగించిన ముగ్గురికి అరదండాలు | - | Sakshi
Sakshi News home page

బరి తెగించిన ముగ్గురికి అరదండాలు

May 8 2026 11:20 AM | Updated on May 8 2026 11:20 AM

ఇద్దరు అంతర జిల్లా నేరస్తులు సహా ఒక బైక్‌ దొంగ అరెస్టు

రూ.51 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువుల రికవరీ

కాకినాడ క్రైం: ఒంటరి మహిళలను టార్గెట్‌ చేసి బంగారు గొలుసులు తెంపుకొని మాయమవడం. అర్ధరాత్రుళ్లు ఇళ్లలో చొరబడి చోరీలు చేయడం, బైక్‌లు దొంగిలించడంలో ఆరితేరిన ముగ్గురు నేరస్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ బిందుమాధవ్‌ గురువారం తన కార్యాలయంలో ఈ వివరాలు విలేకరులకు వెల్లడించారు.

ఇద్దరికి అరదండాలు : తూర్పుగోదావరి జిల్లా రాజవోలు గ్రామానికి చెందిన 30 ఏళ్ల పల్లా సురేంద్రకుమార్‌, కాకినాడ రాగంపేటకు చెందిన 45 ఏళ్ల రంగాల శ్రీనివాసరెడ్డి కలిసి వరుస నేరాలకు పాల్పడుతున్నారు. వీరిద్దరు 12 కేసుల్లో నిందితులు. చైన్‌స్నాచింగ్‌, ఏటీఎం కేంద్రాల వద్ద నేరాలు చేయడంలో సిద్ధహస్తులు. సురేంద్రకుమార్‌ ఏటీఎంలలో వ్యక్తుల నుంచి కార్డు, పిన్‌ చోరీ చేసి డబ్బు డ్రా చేసి పరారయ్యేవాడు. ఇలా ఇతడు 65 ఏటీఎంల వద్ద చోరీలకు పాల్పడ్డాడు. సురేంద్ర, శ్రీనివాస్‌ ఇద్దరూ చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. రోడ్లపై వెళ్లే ఒంటరి మహిళలతో పాటు ఇళ్లలో ఉండే తోడు లేని ఆడవారు, వృద్ధుల్ని లక్ష్యంగా చేసుకొని వీరు పేట్రేగిపోయారు. దారి కాచి మెడలో గొలుసులు తెంపుకెళ్లడం, ఇళ్లల్లోకి అర్థరాత్రుళ్లు చొరబడి బంగారం ఎత్తుకెళ్లడంలో వీరు నేర్పరులు. వీరిద్దరినీ బుధవారం రాత్రి సామర్లకోట జెడ్‌ బ్రిడ్జ్‌ వద్ద అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

బైక్‌ల దొంగ అరెస్టు : కాకినాడ రూరల్‌ మండలం వలసపాకలకు చెందిన 20 ఏళ్ల రచ్చ నాగ సతీష్‌ కుమార్‌ వరుస ద్విచక్రవాహన చోరీలకు పాల్పడుతున్నాడని, అతడిపై సస్పెక్టు షీటు సహా గంజాయి వినియోగం, నాటుసారా సంబంధిత 30 కేసులు జిల్లాలో వివిధ పోలీస్‌స్టేషన్లో ఉన్నాయని అన్నారు. ముద్దాయిని వలసపాకలలో అతడి ఇంటికి సమీపంలో పట్టుకున్నామని తెలిపారు. రెండు కేసుల్లో 320 గ్రాముల బంగారం, 600 గ్రాముల వెండి సామగ్రి, రూ.40 వేల నగదు, 3 బైక్‌లు స్వాధీనం చేసుకున్నామని వీటి విలువ సుమారు రూ.51 లక్షలని ఎస్పీ తెలిపారు. కేసుల ఛేదనలో కీలకంగా వ్యవహరించిన ఏఎస్‌పీ దేవరాజ్‌ మనీష్‌ పాటిల్‌, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.కృష్ణ, కాకినాడ టూ టౌన్‌ సీఐ మజ్జి అప్పలనాయుడిని ఎస్పీ అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement