కాకినాడ రూరల్: భార్యాభర్తల మధ్య మనస్పర్థల నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఎస్.అచ్యుతాపురం మధురానగర్‌కు చెందిన గోకాడ శ్రీనివాసులు(44) బుధవారం రాత్రి మృతి చెందాడు. ఇంద్రపాలెం పోలీసులు తెలిపిని వివరాలివీ.. శ్రీనివాసులకు భార్య పుష్పలత, 14 ఏళ్ల కుమారుడు, 13 ఏళ్ల కుమార్తె ఉన్నారు. కూలి పని చేసుకుని కుటుంబాన్ని పోషించేవాడు. ఇటీవల కాలంలో ఇంటి వద్దే ఖాళీగా ఉండడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ఇటీవల భార్య, పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న శ్రీనివాసులు ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందాడు. గురువారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వీఆర్వో బత్తుల రమణకుమారి ఫిర్యాదు మేరకు ఏఎస్సై ఎం.వాడపల్లి కేసు నమోదు చేశారు.
లేఅవుట్ రోడ్డులో
యువకుడి మృతి
రాజానగరం: ఫరిజల్లిపేట నుంచి చక్రద్వార బంధానికి వెళ్లే డీవీబీ రాజు లేఅవుట్ రోడ్డులో మేడిశెట్టి గంగరాజు (24) ప్రమాదానికి గురై మృతి చెందాడు. రాజానగరం సీఐ వీరయ్యగౌడ్ గురువారం ఇక్కడ మీడియాకు తెలిపిన వివరాలిలా వున్నాయి.. ఫరిజల్లిపేటకు చెందిన దుర్గాప్రసాద్ బుధవారం తన పల్సర్ మోటారు బైకుపై దగ్గరి దారిలో చక్రద్వారబంధం వైపు వెళ్లేందుకు డీవీబీ రాజు లేఅవుట్ రోడ్డులో ప్రయాణిస్తూ అదుపు తప్పి పడిపోయాడు. ఈ క్రమంలో అతని తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రి సమయంలో అటుగా వెళ్తున్న వేరొకరు సమాచారం ఇవ్వడంతో 108 సిబ్బంది అక్కడకు చేరుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే అతను మరణించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. తొలుత దీనిని అనుమానాస్పద స్థితిలో మృతిగా భావించారు. ఘటనా స్థలాన్ని నార్త్ జోన్ డీఎస్పీ జీవన కూడా పరిశీలించారు.


