రాజానగరం: జాతీయ రహదారిని ఆనుకుని వెలుగుబందలో ఉన్న గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జీజీయూ)లో బుధవారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ అధికారి (ఏఓ) జి. శ్రీహరిప్రసాద్ గురువారం రాజానగరం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు వివరాలు ఇలా వున్నాయి.. బుధవారం సాయంత్రం వరకు విద్యార్థులు చెల్లించిన ఫీజులకు సంబంధించిన రూ.3,74,790ను క్యాషియర్ శ్వేత నగదు విభాగంలోని క్యాబిన్‌లో భద్రపరిచారు. గురువారం డ్యూటీకి వచ్చిన సిబ్బంది క్యాబిన్ తలుపులు తెరచివుండటాన్ని గమనించడంతో చోరీ జరిగిన సంగతి తెలిసింది. నగదు విభాగంలో భద్రపరచిన రూ.3,74,790 కనిపించలేదు. అర్ధరాత్రి సమయంలో ఈ చోరీకి పాల్పడివుండవచ్చని అనుమానిస్తున్నారు. ఘటనా స్థలాన్ని నార్త్ జోన్ డీఎస్పీ జీవన, స్థానిక సీఐ వీరయ్యగౌడ్ సందర్శించి, సీసీ కెమెరాలను పరిశీలించారు. నలుగురు వ్యక్తులు ముఖాలకు ముసుగులు ధరించి, చోరీకి పాల్పడినట్టుగా గుర్తించారు.


