● గోదావరి డెల్టాలో
499 క్లోజర్ పనుల గుర్తింపు
● రూ.27 కోట్లతో అంచనాలు
● నిధుల మంజూరులో సర్కారు జాప్యం
● కాలువలు మూసివేసి 18 రోజులు
● ఇప్పటికీ పడని ముందడుగు
నిడదవోలు: గోదావరి డెల్టా కాలువలకు నీటి విడుదలను నిలిపివేసిన తరువాత యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన ఇరిగేషన్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) పనులపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ పనులు అసలు ప్రారంభిస్తారా, లేదా అనే సందిగ్ధత నెలకొంది. గోదావరి తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాల పరిధిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అధికారులు 499 క్లోజర్ పనులను గుర్తించి, రూ.27 కోట్ల అంచనాలతో గతంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అయితే, కాలువలకు నీటి విడుదలను నిలిపివేసిన చాలా రోజుల తరువాత ఈ పనులకు ప్రభుత్వం ఆలస్యంగా నిధులు మంజూరు చేస్తూ ఈ నెల 2న ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నిధులతో మూడు డెల్టాల ప్రధాన కాలువలతో పాటు ఆయా సబ్ డివిజన్ల పరిధిలోని ప్రధాన ఉప కాలువలు, పిల్ల కాలువల్లో పెరిగిపోయిన తూడు, గుర్రపు డెక్కను తొలగించడంతో పాటు స్లూయిజ్‌ల నిర్వహణ, షట్టర్ల మరమ్మతులు, గ్రీజు, ఆయిల్ పంపింగ్ వంటి పనులు చేపట్టాల్సి ఉంది. ఈ పనులు సక్రమంగా చేస్తే శివారు భూములకు సైతం రెండు పంటలకూ పూర్తి స్థాయిలో నీరందుతుంది.
కూటమి నేతల కన్ను
అయితే, క్లోజర్ పనుల్లో కాసులు పిండుకోవాలనే కూటమి నేతలు కొందరు పావులు కదుపుతున్నారు. రూ.10 లక్షల్లోపు పనులను సాగునీటి సంఘాల్లోని రైతులకు నామినేషన్ పద్ధతిపై చేసుకునే అవకాశం ఉంది. దీంతో, రైతుల ముసుగులో ఈ పనులు దక్కించుకునేందుకు కొంతమంది ప్రజాప్రతినిధులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు రూ.10 లక్షలకు పైబడిన పనులు టెండర్ల ద్వారానే చేపట్టాల్సి ఉంటుంది. గోదావరి డెల్టా కాలువలను గత నెల 20న మూసివేశారు. ఇది జరిగి 18 రోజులైనా క్లోజర్ పనులు ఇప్పటికీ చేపట్టలేదు. వచ్చే నెల మొదటి వారంలో ఖరీఫ్ సాగుకు తిరిగి నీరు విడుదల చేయనున్నారు. ఆ గడువు సమీపిస్తూండటం, ప్రభుత్వం ఆలస్యంగా నిధులు మంజూరు చేయడంతో ఈ పనులు పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదు. దీంతో, ఈ ఏడాది క్లోజర్ పనులకు మంగళం పాడినట్లేనని రైతులు భావిస్తున్నారు.
శిథిలావస్థలో శెట్టిపేట స్లూయిజ్
పశ్చిమ డెల్టా పరిధిలోని ఉండి సబ్ డివిజన్‌లో లక్షలాది ఎకరాలకు నీరందించే శెట్టిపేట వియర్ (స్లూయిజ్) శిథిలావస్థకు చేరింది. పశ్చిమ డెల్టాకు సాగునీటిని విడుదల చేసే విజ్జేశ్వరం హెడ్ స్లూయిజ్‌తో పాటు శెట్టిపేట స్లూయిజ్ కూడా ఎంతో ప్రధానమైది. నిడదవోలు మండలం శెట్టిపేట గ్రామంలో పశ్చిమ డెల్టా ప్రధాన కాలువకు కుడి వైపు 1874లో సర్ ఆర్థర్ కాటన్ హయాంలో దీనిని నిర్మించారు. దీని ద్వారానే 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు విడుదల చేస్తారు. ఉండి సబ్ డివిజన్‌లోని ఉండి, వెంకయ్య వియర్, పాత వియర్ కాలువల ద్వారా తాడేపల్లిగూడెం, ఉండి, భీమవరం, తణుకు, పాలకోడేరు, నిడమర్రు, కాళ్ల, ఆకివీడు మండలాలకు శెట్టిపేట స్లూయిజ్ ద్వారానే సాగునీరు విడుదలవుతుంది. వర్షాకాలంలో వరద నీటి నియంత్రకు శెట్టిపేట వియర్ నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తారు. వర్షాలు అధికంగా కురిసే సమయంలో పశ్చిమ డెల్టా ప్రధాన కాలువ గట్లపై నుంచి వరద నీరు పొంగి ప్రవహించి పొలాలను ముంచెత్తుతుంది. ఆ సమయంలో శెట్టిపేట వియర్ నుంచి వరద నీటిని ఎర్ర కాలువ, యనమదుర్రు డ్రెయిన్లకు వదులుతున్నారు. ఇంత ప్రాధాన్యం ఉన్న శెట్టిపేట స్లూయిజ్ ప్రస్తుతం దారుణంగా శిథిలమైంది. కాటన్ హయాంలో రాళ్లతో చేపట్టిన నిర్మాణం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. కానీ, యంత్ర సామగ్రి, షట్టర్లు పూర్తిగా శిథిలమయ్యాయి. ఐదు ఖానాల్లోని 10 షట్టర్లు తుప్పు పట్టాయి. వీటిలో నాలుగు పూర్తిగా ధ్వంసమవడంతో పూర్తిస్థాయిలో కిందకు దిగడం లేదు. ఆ ఖాళీల్లో నుంచి పెద్ద మొత్తంలో నీరు లీకై , వృథా పోతోంది. ఫలితంగా వరదల సమయంలో నీటిని వదిలేందుకు తలుపులు తెరచుకోకపోవడం, బలవంతంగా తెరచిన తలుపులు నీటి క్రమబద్ధీకరణ సమయంలో మూసుకోకపోవడంతో ఇరిగేషన్ సిబ్బంది అవస్థలు పడుతున్నారు. శెట్టిపేట స్లూయిజ్‌ను తక్షణం ఆధునీకరించాలని, తుప్పు పట్టిన షట్టర్లు తొలగించి, కొత్తవి ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నా పట్టించుకున్న వారే కరువయ్యారు. ఫలితంగా రెండు పంటలకూ పూర్తి స్థాయిలో నీరు అందని దుస్థితి నెలకొంది. క్లోజర్ పనులు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడంతో శెట్టిపేట స్లూయిజ్ పనులు ఈ ఏడాది కూడా జరిగే సూచనలు కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు.


