సరస్వతీ పుత్రుల బతుకు పోరాటం | - | Sakshi
Sakshi News home page

సరస్వతీ పుత్రుల బతుకు పోరాటం

May 8 2026 11:08 AM | Updated on May 8 2026 11:08 AM

ప్రైవేటు టీచర్ల మెడపై యాజమాన్యాల కత్తి

అడ్మిషన్లు తెస్తేనే జీతాలంటూ ఒత్తిళ్లు

మండుటెండల్లో ఇంటింటా

విద్యార్థుల కోసం వెంపర్లాట

రాయవరం: ‘సార్‌/మేడమ్‌.. మీ ఇంట్లో ఎంత మంది పిల్లలున్నారు? మా పాఠశాల/కళాశాలలో చేర్పించండి. నాణ్యమైన బోధన ఉంటుంది. మీకు నమ్మకం లేకపోతే ఈ బ్రోచర్‌లో మా ఫలితాలు చూడండి. సీటు ఇప్పుడే కన్ఫర్మ్‌ చేసుకుంటే ఫీజులో రాయితీ ఇప్పిస్తాం’ అంటూ వివిధ ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థల టీచర్లు, అధ్యాపకులు మండుటెండలో ఇంటింటికీ కాళ్లరిగేలా తిరుగుతూ, బతుకు పోరాటం చేస్తున్నారు. ‘ప్లీజ్‌ మేడమ్‌.. మా గురించైనా జాయిన్‌ చేయండి. ప్లీజ్‌ సార్‌.. టార్గెట్లున్నాయి. టార్గెట్‌ పూర్తి చేస్తేనే ఇంక్రిమెంట్‌ ఉంటుంది’ అని ఒకరు.. టార్గెట్‌ పూర్తి చేస్తేనే తమకు జీతాలుంటాయని మరొకరు తమ దురవస్థను విద్యార్థుల తల్లిదండ్రులకు దీనంగా చెప్పుకొంటూ ఆ సరస్వతీ పుత్రులు ప్రయాస పడుతున్నారు. ప్రస్తుతం విద్యా సంస్థలకు అడ్మిషన్ల సమయం కావడంతో పల్లెలు, పట్టణాల్లో ఇటువంటి దృశ్యాలు నిత్యం కనిపిస్తున్నాయి.

గత్యంతరం లేక..

పని చేసేది పాఠశాలలో ఉపాధ్యాయుడిగానే అయినా సెలవనే మాటే ఉండదు. ఆదివారమైనా, వేసవి సెలవులైనా, పండగలైనా వారు ప్రైవేటు/కార్పొరేట్‌ టీచర్లు పని చేయాల్సిందే. ఏటా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతోందంటే చాలు.. వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతూంటాయి. అడ్మిషన్ల సంఖ్య ఆధారంగానే జీతాల చెల్లింపు, ఇంక్రిమెంట్లు, ఉద్యోగ భద్రత ఉంటాయని యాజమాన్యాలు నిష్కర్షగా చెబుతూండటంతో ప్రైవేట్‌ టీచర్లు ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలో ఆందోళనకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. టార్గెట్లు విధించి యాజమాన్యాలు మానసిక వేదనకు గురి చేస్తున్నాయని కొందరు ప్రైవేట్‌ టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో దాదాపు 1,250 ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలుండగా, వీటిల్లో 25 వేల మంది వరకూ బోధన, బోధనేతర సిబ్బంది పని చేస్తున్నట్లు అంచనా. యాజమాన్యం ఇచ్చిన టార్గెట్‌ సాధించకపోతే ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో తెలియదు. గత్యంతరం లేక అడ్మిషన్ల కోసం వారు ఎక్కే మెట్టు, దిగే మెట్టు అన్నట్టుగా అవస్థలు పడుతున్నారు.

రాయవరం మండలం సోమేశ్వరంలో అడ్మిషన్ల కోసం మండుటెండలో తిరుగుతున్న కార్పొరేట్‌ పాఠశాల ఉపాధ్యాయులు

వేధింపులు మానుకోవాలి

అడ్మిషన్ల పేరిట ప్రైవేటు ఉపాధ్యాయులతో వెట్టిచాకిరీ చేయించడం తగదు. అడ్మిషన్లు తెస్తేనే జీతాలిస్తామని లేదా ఉద్యోగంలో కొనసాగుతారని కొన్ని యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వేధింపులకు గురవుతున్న వారు పైకి చెప్పుకోలేక మానసిక వేదన చెందుతున్నారు.

– బి.సిద్ధు, రాష్ట్ర సహాయ కార్యదర్శి,

పీడీఎస్‌యూ, రాయవరం

నిఘా పెట్టాలి

ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో అడ్మిషన్ల పేరిట బోధన, బోధనేతర సిబ్బందిని ఇబ్బంది పెడుతున్నారు. సెలవు దినాల్లోనూ పనులు చేయించుకుంటున్నారు. అడ్మిషన్ల టార్గెట్లు చేరుకోలేని వారికి జీతాలు నిలుపుదల చేయడం తగదు. ఉన్నతాధికారులు నిఘా పెట్టి, వేధిస్తున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలి.

– గండి రవికుమార్‌, రాష్ట్ర కోశాధికారి,

ఏఐఎస్‌ఎఫ్‌, అమలాపురం

దినదిన గండం

ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలు, కళాశాలల్లో పని చేస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత లేదు. ఉద్యోగాలు దినదినగండంగా మారుతున్నాయి. అడ్మిషన్ల టార్గెట్లు పెట్టి ఇంటింటికీ తిప్పుతున్నారు. ఉద్యోగ భద్రతకు, అడ్మిషన్లకు ముడి పెడుతున్నారు. ప్రైవేటు టీచర్ల ఉద్యోగ భద్రతకు చట్టబద్ధత కల్పించాలి.

– దిద్దే రమేష్‌, ప్రధాన కార్యదర్శి, ప్రైవేటు టీచర్స్‌ అండ్‌ లెక్చరర్స్‌ యూనియన్‌, తూర్పు గోదావరి జిల్లా

Advertisement
 
Advertisement
Advertisement