దయనీయ పరిస్థితిలో రైతులు | - | Sakshi
Sakshi News home page

దయనీయ పరిస్థితిలో రైతులు

May 8 2026 11:08 AM | Updated on May 8 2026 11:08 AM

ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు

మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ ఆవేదన

రాజమహేంద్రవరం సిటీ: రాష్ట్రంలోని రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో వారిని కూటమి ప్రభుత్వం నిలువునా ముంచేసిందని వైఎస్సార్‌ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ విమర్శించారు. వరి, మొక్కజొన్న, మామిడి ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను నట్టేట ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఏటా రూ.20 వేల పెట్టుబడి సాయం ఇస్తామంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందన్నారు. ఈ రెండేళ్లలో చంద్రబాబు ప్రతి రైతుకూ రూ.40 వేలు బాకీ పడ్డారన్నారు.. కేంద్ర సాయంతో కలిపి ప్రతి రైతు ఖాతాలో రూ.52 వేలు జమ కావాల్సి ఉందని, కానీ, ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదని ధ్వజమెత్తారు.

ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఏవీ?

గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో పేదలకు అందజేసిన ఇళ్ల పట్టాలు, జగనన్న కాలనీలను కూటమి ప్రభుత్వం అటకెక్కించిందని భరత్‌రామ్‌ అన్నారు. గతంలో తాము ఇచ్చిన ఇళ్లను అగ్గిపెట్టెలని విమర్శించిన చంద్రబాబు.. ప్రతి పేదవాడికి 2 నుంచి 3 సెంట్ల స్థలం ఇస్తామన్న హామీని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో టిడ్కో ఇళ్లు ఖాళీగా ఉన్నాయని, లబ్ధిదారులపై నెలవారీ వాయిదాల (ఈఎంఐ) భారం వేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారులు ధర్నాలు చేస్తున్నారని, మరోవైపు ఈఎంఐలు మొదలవడంతో ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితులు ఉండే అవకాశం లేదని అన్నారు.

పుష్కరాల ఏర్పాట్లపై నిర్లక్ష్యం

గోదావరి పుష్కరాలకు సరిగ్గా ఏడాది సమయం ఉందని, అయినప్పటికీ సంబంధిత ఏర్పాట్లలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని భరత్‌రామ్‌ విమర్శించారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయన పబ్లిసిటీ షూటింగ్‌ కోసం ప్రజలను పుష్కర ఘాట్‌ గేటు వద్ద ఉంచేయడంతో జరిగిన తొక్కిసలాటలో 29 మంది చనిపోయారని గుర్తు చేశారు. శివరాత్రి నాడు 2 లక్షల మందిని అదుపు చేయలేకపోయిన ప్రభుత్వం, 10 కోట్ల మంది వచ్చే పుష్కరాలను ఎలా నిర్వహిస్తుందని ప్రశ్నించారు. ఎక్కువ మంది యాత్రికులు పుష్కర ఘాట్‌కే వస్తారని, ఇప్పుడు కూడా ఏర్పాట్లలో అశ్రద్ధ చూపుతూ, కేవలం మాక్‌ డ్రిల్స్‌తో కాలక్షేపం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పుష్కరాల నిర్వహణ, నిధులపై తక్షణమే మాస్టర్‌ ప్లాన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పుష్కరాలకు ఎంత నిధులు కేటాయిస్తున్నారో బహిరంగ ప్రకటన చేయాలని, పుష్కర కార్యక్రమాలపై బ్లూ ప్రింట్‌ రూపొందించాలని అన్నారు. నగరంలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారంలో ఎమ్మెల్యే విఫలమయ్యారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement