25, 26 తేదీల్లో ఎస్‌బీఐ ఉద్యోగుల సమ్మె | - | Sakshi
Sakshi News home page

25, 26 తేదీల్లో ఎస్‌బీఐ ఉద్యోగుల సమ్మె

May 8 2026 11:08 AM | Updated on May 8 2026 11:08 AM

ప్రకాశం నగర్‌ (రాజమహేంద్రవరం): తమ సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 25, 26 తేదీల్లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినట్లు ఆలిండియా ఎస్‌బీఐ ఉద్యోగుల ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి ఎల్‌.చంద్రశేఖర్‌ తెలిపారు. ఈ మేరకు యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చామన్నారు. కంబాలచెరువు ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అఖిల భారత స్టేట్‌ బ్యాంక్‌ ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు, ఎస్‌బీఐ ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఈ సమ్మెకు పిలుపునిచ్చామని చెప్పారు.. మెసెంజర్లు, ఆర్మ్‌డ్‌ గార్డుల శాశ్వత నియామకాలు, వెంటనే క్లర్క్‌ల నియామకాలు చేపట్టాలని, పర్మినెంట్‌ ఉద్యోగాల్లో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను నియమించరాదని, ఎన్‌పీఎస్‌ ఉద్యోగులకు పెన్షన్‌ ఫండ్‌ మేనేజర్‌ ఆప్షన్లు మార్చాలని, కెరీర్‌ ప్రోగ్రెషన్‌ స్కీమ్‌పై పునరాలోచించాలని, మెడికల్‌ బెనిఫిట్లను మెరుగుపరచాలని, హెచ్‌ఆర్‌ఎంఎస్‌ సంబంధిత సమస్యలు పరిష్కరింఆలని, పెన్షనర్ల పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్లతో ఈ సమ్మె చేస్తున్నామని చంద్రశేఖర్‌ వివరించారు.

ప్రభుత్వం రైతులను

గాలికొదిలేసింది

అమలాపురం టౌన్‌: చంద్రబాబు ప్రభుత్వం రైతులను, వ్యవసాయాన్ని గాలికొదిలేసిందని వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబీ) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో ఏ పంటలకూ మద్దతు ధరలు దక్కడం లేదని ఆరోపించారు. అమలాపురంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత సంవత్సరం టమాటా, మొక్కజొన్న, పొగాకు, శనగ, కోకో, అరటి, మామిడి, సజ్జ ఇలా ఏ పంటకూ మద్దతు ధర ఇవ్వలేదన్నారు. మొక్కజొన్న మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,400 దక్కాలి. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.1,400, రూ.1,600కు రైతులు అయినకాడికి అమ్ముకుంటున్నారని చెప్పారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకల్లో మొక్కజొన్నకు రూ.2,400 మద్దతు ధరను ఆ ప్రభుత్వాలు ఇస్తున్నాయని బాబీ చెప్పారు. ఎంతసేపూ మాది ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం, డబుల్‌ ఇంజిన్‌ పాలన అంటూ సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడమే తప్ప రైతులను ఆదుకోవడంలో మాత్రం వెనుకబాటులో ఉన్నారని విమర్శించారు. పొగాకు మద్దతు ధర కోసం ఇబ్బందులపై గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లిలో రైతులు ధర్నా చేశారన్నారు. కేజీ పొగాకుకు రూ.265 కూడా రావడం లేదని చెప్పారు. అదే గత సంవత్సరం రూ.450 ఉందన్నారు. మొక్కజొన్న, పొగాకు రైతులు కష్టనష్టాలు వర్ణనాతీతమని బాబీ ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు నాయకులు బ్లాక్‌ మార్కెట్‌ వ్యవహారాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. పొగాకు నుంచి మొన్నటి ఎరువులు, నిన్నటి డీజిల్‌ కొరత వరకూ కొందరు కూటమి నేతలు దళారులై కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని చెప్పారు. అమరావతి పనులకు డీజిల్‌ సమృద్ధిగా ఇవ్వాలని ఆయిల్‌ కంపెనీలకు లేఖలు రాసి కాంట్రాక్టర్ల కొమ్ము కాసిన చంద్రబాబు ప్రభుత్వం రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదని బాబీ విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement