ఇద్దరు అంతర్‌ జిల్లాల దొంగల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు అంతర్‌ జిల్లాల దొంగల అరెస్ట్‌

May 8 2026 11:08 AM | Updated on May 8 2026 11:08 AM

రూ.97.50 లక్షల సొత్తు స్వాధీనం

ఎస్పీ రాహుల్‌ మీనా వెల్లడి

అమలాపురం టౌన్‌: వారు ఇంటి తలుపుల టవర్‌ బోల్ట్‌లు తీయడంలో, ఐరన్‌ రాడ్‌తో తాళాలు పగులగొట్టడంలో సిద్ధహస్తులు. ఇంట్లోని వారు నిద్రిస్తుండగానే చడీ చప్పుడు లేకుండా చోరీలు చేయడం వారి నైజం. కొత్తపేట ఓల్డ్‌ బ్యాంక్‌ వీధిలోని ఒక డాబా ఇంట్లో గత సంవత్సరం ఆగస్టు 30న జరిగిన చోరీ కేసు దర్యాప్తు చేస్తుండగా తీగ లాగితే డొంక కదిలినట్లు ఆ దొంగల చోరీల చిట్టా బయట పడింది. మరింత లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు ఎట్టకేలకు ఆ ఇద్దరు దొంగలను వల పన్ని పట్టుకున్నారు. వారి నుంచి రూ.97.50 లక్షల సొత్తు రికవరీ చేశారు. కాకినాడ జిల్లా ఏటిమొగ గ్రామానికి చెందిన పొన్నాడ రవిశంకర్‌ (వీరబాబు), తూర్పు గోదావరి జిల్లా అనపర్తి గ్రామానికి చెందిన వైరా చిరంజీవి ఈ చోరీలకు పాల్పడ్డారు. రవిశంకర్‌ను కొత్తపేట నాయుడు రైస్‌ మిల్లు వద్ద, చిరంజీవిని అనపర్తిలో అరెస్టు చేశారు. అమలాపురంలోని తన కార్యాలయంలో ఎస్పీ రాహుల్‌ మీనా విలేకరులకు గురువారం ఈ వివరాలు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న 646.361 గ్రాము ల బంగారు నగలు, రూ.2,100 నగదు, మోటారు సైకిల్‌, స్మార్ట్‌ ఫోన్‌, ల్యాప్‌టాప్‌ను చూపించారు.

14 చోరీల కేసుల్లో సొత్తు స్వాధీనం

ఈ అంతర జిల్లాల దొంగలు కోనసీమతో పాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొత్తం 14 చోరీలకు పాల్పడ్డారు. కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రెండు, రావులపాలెం స్టేషన్‌ పరిధిలో 1, తూర్పు గోదావరి జిల్లా పెరవలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 3, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టౌన్‌, ఇరగవరం, తణుకు టౌన్‌, తణుకు రూరల్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో తలో రెండు చోరీలు చేశారు. ఈ 14 చోరీ కేసుల నుంచి మొత్తం రూ.97.50 లక్షల సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఏ–1పై 120 చోరీలు, ఏ–2పై హత్య కేసు

ఈ చోరీల్లో ఏ–1 అయిన రవిశంకర్‌ ఇప్పటి వరకూ 120 ఇంటి దొంగతనాలకు పాల్పడినట్లు కొత్తపేట పోలీసుల దర్యాప్తులో తేలింది. ఏ–2 అయిన చిరంజీవిపై గతంలో హత్య కేసు కూడా నమోదైనట్లు పోలీసులు గుర్తించారు.

అధికారులు, సిబ్బందికి ఎస్పీ అభినందన

అంతర జిల్లాల దొంగలను అరెస్ట్‌ చేసి సొత్తును రికవరీ చేయడంపై ఎస్పీ మీనా పోలీస్‌ అధికారులు, క్రైమ్‌ సిబ్బందిని ప్రశంసించి వారికి నగదు రివార్డులు అందజేశారు. కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్‌, రావులపాలెం రూరల్‌ సీఐ విద్యాసాగర్‌, అమలాపురం క్రైమ్‌ సీఐ ఎం.గజేంద్రకుమార్‌, కొత్తపేట ఎస్సై జి.సురేంద్రకుమార్‌, క్రైమ్‌ ఎస్సైలు ఎ.పరదేశి, అయితాబత్తుల బాలకృష్ణ, ఏఎస్‌ఐ ఎం.సుబ్బరాజు, కానిస్టేబుళ్లు లంకాడి శ్రీను, డి.అర్జునరావు, బీడీవీ ప్రసాద్‌, జి. కృష్ణసాయి, ఎ.శుభాకర్‌, ఆర్‌సీహెచ్‌వీ ప్రసాద్‌, ఎం.హరిబాబులకు ఎస్పీ మీనా రివార్డులు అందించి అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement