ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): గోదావరి తీరాన ఈమని కల్యాణి లక్ష్మీనారాయణ, పసుమర్తి పద్మినిల వీణావాదన శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి 75 వసంతాల సందర్భంగా అమృతోత్సవం పేరిట స్థానిక గోదావరి గట్టున ఉన్న సమితి ప్రాంగణంలోని ఏసీ ఆడిటోరియంలో 18 రోజుల పాటు సంగీత మహోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రెండో రోజైన గురువారం సాయంత్రం కల్యాణి, పద్మినిలు వందేమాతరం గీతంతో వీణావాదన ప్రారంభించి, త్యాగరాజ కీర్తనలు, కృతులు వాయించారు. హంసధ్వని రాగంలో ’బంధురీతి కొలువీయవయ్యా..’, మాయమాళవగౌడ రాగంలో ‘మనవి ఆలకించరాదటే..’, అభేరి రాగంలో ‘నగుమోము..’, శ్రీరాగంలో ‘ఎందరో మహానుభావులు..’, హిందోళ రాగంలో ‘సామజవరగమన’ వంటి కీర్తనలు, కృతులు వాయించి శ్రోతలను మైమరపించారు. కరుటూరి నందకుమార్ సితార, కాపా శ్రీనివాస్ మృదంగం, పండుగ మురళి తబలపై సహకరించి కచేరీని రక్తి కట్టించారు. సమితి గౌరవ చైర్మన్ వాడ్రేవు వెంకట రమణారావు, చైర్మన్ సీఎస్ వెంకట్రావు, ప్రిన్సిపల్ సెక్రటరీ జోస్యుల సరస్వతి, ఫంక్షనల్ సెక్రటరీ వక్కలంక శ్రీరామచంద్రం, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ విశ్వనాథం భాస్కరరామ్, కోశాధికారి వి.కృష్ణకుమారి, ప్రవచన రాజహంస ధూళిపాళ మహాదేవమణి, పలువురు సంగీత ప్రియులు పాల్గొన్నారు. ఈ నెల 23వ తేదీ వరకూ నిర్వహించే సంగీతోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు విజయవాడకు చెందిన పీవీఎన్ కృష్ణ బృందంచే శ్రీకృష్ణరాయబారం పౌరాణిక పద్య నాటకం ప్రదర్శిస్తారు.


