రత్నగిరిపై పెళ్లి సందడి | - | Sakshi
Sakshi News home page

రత్నగిరిపై పెళ్లి సందడి

May 8 2026 11:08 AM | Updated on May 8 2026 11:08 AM

నేటి రాత్రి 7 గంటల ముహూర్తానికి 150కి పైగా వివాహాలు

వివాహ మండపాలు, సత్రం గదులు ఇప్పటికే రిజర్వ్‌

అన్నవరం: రత్నగిరి, సత్యగిరి ప్రతిధ్వనించేలా సత్యదేవుని సన్నిధిలో నేడు పెళ్లి బాజాలు మోగనున్నాయి. శుక్రవారం రాత్రి 7 గంటల ముహూర్తంలో 150కి పైగా జంటలు ఒక్కటి కానున్నాయి. దీంతో, కొండపై ఎక్కడ చూసినా పెళ్లి సందడే కనిపిస్తోంది. ఇప్పటికే పెళ్లి బృందాలు వివాహ మండపాలు, సత్రం గదులను రిజర్వ్‌ చేసుకున్నాయి. సత్యగిరిపై 36 వివాహ హాల్స్‌, వివిధ సత్రాల్లో వివాహాలు చేసుకునే స్థలాలను, రెండు ఉచిత వివాహ మండపాల్లోని 24 చిన్న కల్యాణ మండపాలను కూడా రిజర్వ్‌ చేసుకున్నారు. అలాగే, వివిధ సత్రాల్లో 400 గదులుండగా.. 300కు పైగా గదులను వివాహ బృందాల వారు బుక్‌ చేసుకున్నారు. దేవస్థానం అధికారికంగా 70 శాతం గదులకు ఆన్‌లైన్‌ ద్వారా రిజర్వేషన్‌కు అనుమతి ఇచ్చింది. వీటితో పాటు ప్రజాప్రతినిధులు, వీఐపీల సిఫారసు లేఖలతో మరో 100కు పైగా గదులు రిజర్వ్‌ చేశారు. దీంతో, సామాన్య భక్తులకు శుక్రవారం గదులు దొరకడం కష్టమేనని అధికారులు తెలిపారు.

13 తేదీతో శుభం కార్డు

వైశాఖ మాసంలో వివాహాలకు ఈ నెల 13వ తేదీతో శుభం కార్డు పడనుంది. వైశాఖంలో ఈ నెల 9, 12, 13 తేదీల్లో వివాహ ముహూర్తాలున్నాయి. అయితే, అవి అంత పెద్ద ముహూర్తాలు కావని దేవస్థానం అధికారులు చెప్పారు. ఆ తేదీల్లో సత్యదేవుని సన్నిధిలో 50 వివాహాల వరకూ జరిగే అవకాశం ఉంది. ఈ నెల 17న అధిక జ్యేష్ట మాసం ప్రారంభమవుతోంది. దీంతో, ఆ మాసంలో వివాహాలు జరగవు. తిరిగి జూన్‌ 16 నుంచి నిజ జ్యేష్ట మాసం ప్రారంభమవుతుంది. ఆ మాసంలో వివాహాలు జరుగుతాయి. ఆగస్టు 13న ప్రారంభమవుతున్న శ్రావణ మాసంలో కూడా పెద్ద సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement