రాయవరం: ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన అనంతరం పెట్రోలు, డీజిల్ ధరలను పెంచే యోచనేదీ లేదని చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచేసింది. ఇప్పటికే సిలిండర్ల కొరతతో సతమతమవుతున్న హోటల్ రంగంపై ధరల పెంపు తీవ్ర ప్రభావం చూపుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే వ్యాపారం మూసేసుకోవాల్సిందేనని హోటళ్ల యజమానులు వాపోతున్నారు. గ్యాస్ సిలిండర్ ధరను కేంద్రం ఒకేసారి రూ.993 మేర పెంచేసింది. దీంతో, దీని ధర ఒక్కసారిగా రూ.3,315కు పెరిగింది. దాదాపు రూ.వెయ్యి మేర ధర పెరగడంతో హోటల్ వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. యుద్ధ ప్రభావంతో ధరలు పెరుగుతాయనే అంచనాలున్నా.. ఇంత భారీగా పెంచేస్తారని ఊహించలేదని అంటున్నారు. ఇప్పటికే సిలిండర్ల కొరతతో నెట్టుకొస్తున్న తమపై పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర మరింత భారంగా మారిందని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. కేంద్రం పెంచిన భారం ప్రత్యక్షంగా హొటల్స్‌పై పడినప్పటికీ పరోక్షంగా ఆ భారం ప్రజలు భరించాల్సిందే.
గతంలో ఎన్నడూ లేని విధంగా..
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర సాధారణంగా రూ.50 నుంచి రూ.150 పెంపు ఉంటుంది. కానీ ఒకేసారి ఇంత భారీగా పెరగడం గతంలో ఎన్నడూ లేదని వ్యాపారులు పేర్కొంటున్నారు. ధర పెరగడం వ్యాపారాల నిర్వహణకు సవాల్‌గా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి పెరిగిన ధర మళ్లీ తగ్గే అవకాశం ఉండకపోవచ్చని వ్యాపారులు అంటున్నారు. గతంలో వలే పరిస్థితులు ఇక రాకపోవచ్చనేది వ్యాపారుల భావన.
కాకా నుంచి పెద్ద హోటల్స్ వరకు..
గ్రామాలు, పట్టణాల్లో కాకా హోటళ్ల నుంచి బడా హోటళ్లకు వరకు సిలిండర్ ధరల ప్రభావం చూపుతోంది. రోడ్డు పక్కగా ఉన్న టీ స్టాల్స్, టిఫిన్ సెంటర్లు, చాట్ సెంటర్లు, చిన్న చిన్న బిర్యానీ, భోజన హోటళ్ల యజమానులు ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్ సాధారణ ధర పెరిగితే రూపాయి నుంచి రెండు రూపాయల వరకు టీ, టిఫిన్ల ధరలు పెంచవచ్చని. కానీ ఏకంగా ఒకేసారి రూ.వెయ్యి వరకూ సిలిండర్ ధర పెరగడంతో నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేసుకోవాలా అని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. వ్యాపారంలో ఆదాయం రాకున్నా లోటును భర్తీ చేసుకోవడానికి తాము కూడా రూ.10 వరకూ పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని చిరు వ్యాపారులు వాపోతున్నారు. మరోవైపు ధరలు పెంచితే గిరాకీ దెబ్బ తింటుందనే భయం కూడా వారిని వెన్నాడుతోంది. పెద్ద పెద్ద హోటళ్ల యజమానులు సైతం గ్యాస్ ధర పెంపుతో సమస్యలు ఎదురు కానున్నాయనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆన్‌లైన్ ఆర్డర్లపై కూడా ప్రభావం
గ్యాస్ సిలిండర్ ధర పెరగడంతో ఆన్‌లైన్ ఆర్డర్ల డిమాండ్ కూడా తగ్గవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈ ప్రభావం వర్కర్లపై కూడా పడి జీవనోపాధి దెబ్బతినే అవకాశం ఉంటుందని వ్యాపారులు అంటున్నారు. ముఖ్యంగా యూత్ నుంచే ఎక్కువగా ఆన్‌లైన్ ఆర్డర్లు ఉంటాయని, ధరల పెంపుతో ఎంతో కొంత తగ్గుముఖం పడతాయని వ్యాపారులు నిరాశ చెందుతున్నారు.
కట్టెల ధరల మంట
చిరు, మధ్య తరహా హోటల్ వ్యాపారులు కట్టెలను ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు. వాటి ధర కూడా పెరిగిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 25 కేజీల వంట చెరకు రూ.170 ఉండగా, గ్యాస్ కొరత ప్రారంభమైన తర్వాత రూ.225కు పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో పరిస్థితి ఇదీ..
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారుగా 200 వరకూ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో కమర్షియల్ సిలిండర్ల కనెక్షన్లు 5 వేల వరకు ఉండగా, కాకినాడ జిల్లాలో 20 వేలు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 1,400 వరకు ఉన్నాయి. రోజుకు దాదాపు 10 వేల సిలిండర్లను వినియోగిస్తున్నట్టు అధికారుల గణాంకాల ద్వారా తెలుస్తుంది.
ఫ హోటళ్లపై కమర్షియల్ గ్యాస్ ధరాభారం
ఫ ఒకేసారి రూ.993 మేర
బాదేసిన కేంద్రం
ఫ వ్యాపారం మూసుకోవాల్సిందేనని యజమానుల ఆవేదన
గిట్టుబాటు కావడం లేదు
ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం హోటల్ నిర్వహిస్తున్నాను. గ్యాస్ ధరలు పెరగడంతో ఉదయం టిఫిన్లు ఆపేశాను. ధరలు పెంచితే కస్టమర్లు దూరమవుతున్నారు. పెంచకపోతే నిర్వహణ కష్టమవుతుంది. భోజనం ధరలు పెంచాల్సి వచ్చింది.
– అనపర్తి జయకృష్ణ, రెస్టారెంట్ యజమాని, రాయవరం
కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నాం
కట్టెల పొయ్యిలపై వంట చేయాల్సిన పరిస్థితి వచ్చింది. స్వల్పంగా ధరలు పెంచి అతి కష్టం మీద నిర్వహిస్తున్నాం.
– వి.రాజేష్,
హోటల్ నిర్వాహకుడు, రాయవరం


