సాక్షి ప్రతినిధి, కాకినాడ: కొంతమంది అక్రమార్కులకు దేవదాయ శాఖ రూ.లక్షలు కురిపించే కల్పవృక్షంగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. పైసలిస్తే చాలు హోదాలు, మార్గదర్శకాలను గాలికొదిలేసి మెచ్చిన వారికి నచ్చిన సీటు కట్టబెట్టేస్తున్నారు. ఆదాయం దండిగా వచ్చే ఆలయాలకు పోస్టింగ్‌లు ఇవ్వడంలో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ప్రధాన ఆలయాల్లో ఇటీవల జరిగిన ఈఓల బదిలీలపై అనేక విమర్శలు వస్తున్నాయి.
ఇంకా..
ఫ ఉమ్మడి తూర్పు గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పేరెన్నికగన్న తుని తలుపులమ్మ అమ్మవారి లోవ దేవస్థానం ఈఓగా డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారిని నియమించాలి. కానీ, ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్ హోదా కలిగిన పెన్మత్స విశ్వనాథరాజును ఈఓగా కొనసాగిస్తున్నారు. లోవ దేవస్థానం ప్రసాదం తయారీలో నాణ్యత లేకపోవడంతో ఆహార నియంత్రణ శాఖ అధికారులు కొన్నాళ్ల కిందట దాడులు చేసిన జరిమానా విధించారు. ఇక్కడ డీసీ స్థాయి అధికారి లేకపోవడమే దీనికి కారణమనే విశ్లేషణలు అప్పట్లో సిబ్బంది నుంచి వచ్చాయి.
ఫ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి దేవస్థానానికి అసిస్టెంట్ కమిషనర్ హోదా కలిగిన ఈఓను నియమించాలి. కానీ, ఇక్కడ పెద్దాపురం మహారాణి సత్రం గ్రేడ్–2 ఈఓగా ఉన్న కాట్నం జగన్మోహన శ్రీనివాస్‌ను నియమించారు. గ్రేడ్–1 సీనియార్టీ కలిగిన ఎంతో మంది వారి అర్హత కంటే తక్కువ స్థాయి ఆలయాల్లో ఈఓలుగా పని చేస్తున్నారు. వీరిలో ఏ ఒక్కరికీ అవకాశం ఇవ్వకుండా నిబంధనలు పక్కన పెట్టి మరీ గ్రేడ్–2 ఈఓను కుక్కుటేశ్వరస్వామి ఆలయంలో నియమించారు. అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారి లేకపోవడంతో ఇక్కడ యంత్రాంగం మధ్య సమన్వయంలోపించి, భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విమర్శలున్నాయి. ఈ కారణంగానే అప్పటి కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ బిందుమాధవ్ మహాశివరాత్రి వేడుకల ఏర్పాట్లను స్వయంగా చక్కబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడి యంత్రాంగం భక్తుల కంటే నిత్యం అధికార పార్టీ నేతల సేవలోనే తరిస్తున్నారనే చర్చ నడుస్తోంది.
ఫ వాస్తవానికి అసిస్టెంట్ కమిషనర్ హోదా కలిగిన అల్లు వెంకట దుర్గాభవాని పిఠాపురం ఆలయ ఈఓగా పని చేసేవారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాగానే ఆమెను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ పంచారామ క్షేత్రానికి బదిలీ చేయడం గమనార్హం.
ఫ చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చీ రాగానే కాకినాడ బాలా త్రిపుర సుందరీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి గ్రేడ్–1 ఈఓగా ఉన్న చింతపల్లి విజయభాస్కర్‌రెడ్డిని తప్పించారు. ఆయన స్థానంలో కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చింతలూరు నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో గ్రేడ్–2 ఈఓగా ఉన్న వుండవల్లి వీర్రాజు చౌదరికి అదనపు బాధ్యతలు అప్పగించారు. సొంత సామాజిక వర్గానికి చెందిన నాయకులు పట్టుబట్టి మరీ ఆయనను నియమించుకున్నారనే విమర్శలున్నాయి.
ఫ కాకినాడ సినిమా రోడ్డులోని మంత్రిప్రగడ వారి సత్రం ఈఓగా గ్రేడ్–1 కేడర్ అధికారిని నియమించాలి. కానీ, ఇక్కడ గ్రేడ్–2 ఈఓ శ్రీనివాస్‌ను నియమించారు. ఆయనకు కాకినాడ గాంధీనగర్ ఆలయంతో పాటు కాకినాడ రూరల్ కొవ్వూరు వారాహి అమ్మవారి దేవస్థానం ఇన్‌చార్జి బాధ్యతలు సైతం అప్పగించారు. ఇక్కడ గ్రేడ్–1 ఈఓగా ఉన్న సౌజన్యను తప్పించి గ్రేడ్–2 ఈఓ శ్రీనివాస్‌కు అదనపు బాధ్యతలు అప్పగించడం గమనార్హం. ఇలా హోదాలు, కేడర్లతో పని లేకుండా మెచ్చిన వారికి నచ్చిన సీటును ఇష్టారాజ్యంగా కట్టబెట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఫ దేవదాయ శాఖ
బదిలీల్లో నిబంధనలకు నీళ్లు!
ఫ ఇష్టానుసారం ఈఓల స్థాన చలనం
ఫ భారీగా డబ్బు చేతులు
మారుతోందని ఆరోపణలు
కాకినాడ జిల్లా దేవదాయ శాఖ అధికారి కనపర్తి నాగేశ్వరరావు మార్చి 31న ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో పుష్కర కాలం క్రితమే గ్రేడ్–1 ఈఓగా పదోన్నతి పొందిన, సీనియర్ అయిన నడకుదురు గ్రూపు టెంపుల్స్ ఈఓ తలాటం సూర్యనారాయణను ఏప్రిల్ 1న నియమించారు. అయితే, ఆ శాఖలో ఉన్నత స్థాయి అధికారుల కనుసన్నల్లో చక్రం తిప్పుతున్న ఓ కోటరీ నెల రోజులు దాటీ దాటగానే సూర్యనారాయణను సాగనంపేసింది. దీనికి సరైన కారణం కూడా చూపించకపోవడంతో ఆ శాఖ ఉద్యోగులే విస్మయానికి గురయ్యారు. సూర్యనారాయణ స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న వి.వెంకటేశ్వరరావును ఉద్యోగోన్నతిపై కాకినాడ జిల్లా దేవదాయ శాఖాధికారిగా నియమించారు. వాస్తవానికి ఈ పోస్టింగ్ ఇవ్వాలంటే సీనియర్ గ్రేడ్–1 ఈఓ లేదా ఆ శాఖలో సూపరింటెండెంట్ హోదా అయినా ఉండాలి. అమలాపురంలో దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న సమయంలో వెంకటేశ్వరరావుపై ఏసీబీ కేసు పెండింగ్‌లో ఉందని ఆ శాఖ ఉద్యోగులు బహిరంగంగా చెప్పుకొంటున్నారు. ఈ కేసు తేలకుండానే ఆయనకు ఉద్యోగోన్నతి కల్పించి, జిల్లా అధికారిగా నియమించడంలో ఆంతర్యమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో జిల్లా దేవదాయ శాఖ కార్యాలయంలో పని చేస్తున్న ఓ ఉన్నతాధికారి చక్రం తిప్పినట్టు ఉద్యోగ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జిల్లాలో సీనియర్ గ్రేడ్–1 ఈఓలు ఎంతో మంది ఉండగా రెండు జిల్లాల అవతల నుంచి అది కూడా గ్రేడ్–1కు అర్హత లేని వారిని ఎలా నియమిస్తారని ప్రశ్నిస్తున్నారు.


