మేకల పెంపకంతో జీవనోపాధి | - | Sakshi
Sakshi News home page

మేకల పెంపకంతో జీవనోపాధి

May 7 2026 8:14 AM | Updated on May 7 2026 8:14 AM

సమగ్ర యాజమాన్యంతో అదనపు ఆదాయం

జేడీఏ శ్రీనివాసరావు

రాయవరం: మేకల పెంపకంతో జీవనోపాధి పొందవచ్చని పశు వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఆ శాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో 37,700 మేకలు ఉన్నట్లు సమాచారం. సమగ్ర యాజమాన్య పద్ధతులలో వాటి పెంపకంపై పశు సంవర్ధక శాఖ జేడీ టి.శ్రీనివాసరావు సూచనలిస్తున్నారు.

రోజుకు 10 గంటల పాటు మేపాలి

మేకలు త్వరగా వృద్ధి చెందాలంటే వాటికి సరిపడ మేత అందించాలి. రోజుకు ఎనిమిది నుంచి 10 గంటల పాటు మేపాలి. ఇందు కోసం వాటిని ఉంచే ప్రాంతం చుట్టూ ఖాళీ స్థలంలో గ్రాసాన్ని పెంచాలి. మేకలు ఎక్కువుగా ఆకులు, పండ్ల తొక్కలు, కూరగాయల ఆకులను తినడానికి ఇష్టపడతాయి. అందుకే అవిశ, రావి, తుమ్మ, అల్లనేరేడు, సీమచింత, వేప, సుబాబుల్‌, దిరిశనం తదితర మొక్కలు నాటుకుని ఆ ఆకులను మేతగా వేస్తుండాలి. వీటితో పాటు కాయజాతిలో ఏకవార్షిక రకాలైన జొన్న, కాయజాతి పశుగ్రాసాలైన లూసర్న్‌ తదితరాలను పెంచాలి. పచ్చి మేత వేసేటప్పుడు సుమారు కిలో చెట్ల ఆకులు, కిలో కాయజాతి పచ్చిమేత, మూడు కిలోల ఇతర గ్రాసాలను ఇవ్వాలి.

చూడి మేకలను ఇలా

మేకలు చూడి కట్టిన మూడు నెలల తర్వాత గర్భంలోని పిల్ల పెరుగుదల వేగంగా ఉంటుంది. ఈ సమయంలో 200 నుంచి 250 గ్రాముల మిశ్రమ దాణా అదనంగా ఇవ్వాలి. దీని వల్ల పిల్లలు ఎక్కువ బరువుతో పుడతాయి. తల్లి మేక ఆరోగ్యంగా ఉంటే పిల్లకు పాలు ఎక్కువ ఇస్తుంది.

ముర్రుపాలు బాగా తాగించాలి

పిల్లలు మేక నుంచి బయటకు వచ్చిన వెంటనే ముక్కు రంధ్రాలు, నోటిపై ఉన్న పొరలను తీసి వేయాలి. బొడ్డుకు టింక్చర్‌ అయోడిన్‌ పూయాలి. పిల్లలను ఉంచే ప్రదేశంలో 10 శాతం ఫినాయిల్‌ చల్లాలి. ఈనిన వెంటనే పొదుగును శుభ్రంగా కడిగి ముర్రుపాలు తాగించాలి. తర్వాత రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు రెండు నెలల పాటు తాగిస్తే వాటికి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తర్వాత తల్లి నుంచి వేరు చేసి దాణా, పచ్చిమేత, లేత ఆకులు అందుబాటులో ఉంచాలి. మేక పిల్లల షెడ్డులో/పాకలో కాని ఉప్పు, లవణ మిశ్రమ ఇటుకలను ఏర్పాటు చేయాలి. పిల్లల దాణాలో మొక్కజొన్న, వేరుశనగ చెక్క, గోధుమ పొట్టు, బియ్యం, నూక, జొన్నలు ఉండేలా చూసుకోవాలి.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

● పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు మేత, నీరు, ముందు జాగ్రత్తగా టీకాలు వేయించాలి.

● బయటి ప్రాంతంలో మేస్తున్నప్పుడు తినే గడ్డి, ఇతర ఆకులు అలమలతో పాటు ఏలిక పాములు, బద్దెపురుగులు వాటి శరీరంలో చేరి పోషకాల్ని పీల్చి వేసి, అనారోగ్యానికి గురిచేస్తాయి.

● మూడు నెలల దాటిన మేక పిల్లలకు నట్టల నివారణ మందు తాగించాలి.

Advertisement
 
Advertisement
Advertisement