‘త్యాగరాజ’ అమృతోత్సవాలకు శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

‘త్యాగరాజ’ అమృతోత్సవాలకు శ్రీకారం

May 7 2026 8:14 AM | Updated on May 7 2026 8:14 AM

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌): కీర్తిశేషులు బుగ్గా పాపయ్య శాస్త్రి నెలకొల్పిన శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి 75 వసంతాల సందర్భంగా అమృతోత్సవం పేరిట 18 రోజుల పాటు నిర్వహించే సంగీత మహోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక గోదావరి గట్టున గల సమితి ప్రాంగణంలోని ఏసీ ఆడిటోరియంలో జూపూడి సరోజినీదేవి కళా ప్రాంగణంపై ఈనెల 23వ తేదీ వరకు ఈ ఉత్సవాలు సాగనున్నాయి. రోజూ సాయంత్రం నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు విశాఖపట్నానికి చెందిన గురువిల్లి అప్పన్న బృందం నాదస్వరంతో ఉత్సవాలకు శుభారంభం పలికారు. అనంతరం స్థానిక కళాకారులతో త్యాగరాజ పంచరత్న సేవ వీనుల విందుగా సాగింది. తొలుత సమితి ప్రాంగణంలోని త్యాగరాజ స్వామి మందిరంలో పూజలు చేసి, వై.సత్యనారాయణ, యశోద బృందం మంగళ వాయిద్యాల నడుమ ప్రాంగణానికి చేరుకున్నారు. వేద పఠనం అనంతరం ఈమని కల్యాణి లక్ష్మీ నారాయణ, పసుమర్తి పద్మిని జ్యోతి ప్రకాశనం చేశారు. సమితి గౌరవ అధ్యక్షుడు వాడ్రేవు వెంకట రమణారావు, చైర్మన్‌ సీఎస్‌ వెంకట్రావు, ప్రిన్సిపల్‌ సెక్రటరీ జోస్యుల సరస్వతి, ఫంక్షనల్‌ సెక్రటరీ వక్కలంక శ్రీరామచంద్రం, ఎగ్జిక్యూటివ్‌ సెక్రటరీ విశ్వనాథం భాస్కర రామ్‌, కోశాధికారి వి.కృష్ణకుమారి, సంగీత ప్రియులు పాల్గొన్నారు. సీఎస్‌ వెంకట్రావు పరిచయ వ్యాక్యాలు పలికారు. నాదస్వరంలో శ్రీ గణపతిని సేవింపరాదే, సంగీత జ్ఞానము, శోభిల్లు సప్తస్వర, ఎంత ముద్దో వంటి త్యాగరాజ కీర్తనలు వాయించారు. జగదానందకారక, దుడుకు గల, సాధించేనే, కనకన రుచిరా, ఎందరో మహానుభావులు పంచరత్న కృతుల బృందాగానంతో అలరించారు. అయ్యగారి సత్యప్రసాద్‌ దంపతులు, వేలూరి లక్ష్మీ తులసి, ముట్నూరి పార్వతి, మల్లాది నరసింహారావు, సంగీత పాఠశాల పూర్వ, ప్రస్తుత విద్యార్థులు పంచరత్న సేవలో పాల్గొన్నారు.

నాదస్వరం, పంచరత్న సేవతో

శుభారంభం

Advertisement
 
Advertisement
Advertisement