జగ్గంపేట: మండలం రామవరం గ్రామానికి చెందిన రావుల సత్తిబాబు(43) హత్యకు గురయ్యాడు. సీఐ బి.తిరుపతిరావు అందజేసిన వివరాల మేరకు సత్తిబాబు తన భార్యతో ఉన్న కుటుంబ కలహాల నేపథ్యంలో మంగళవారం ఆమెతో మాట్లాడి వస్తానని ఇంట్లో చెప్పి రాజానగరం వెళ్లాడు. బుధవారం ఉదయం రామవరంలోని సచివాలయం సమీపంలో కాలువ గట్టు వద్ద అతని మృతుదేహం లభ్యం కావడంతో కటుంబ సభ్యుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వెంటనే ఎస్సై రఘునాథరావుతో పాటు సీఐ ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృత దేహంపై గాయాలు కనపడడంతో హత్యకు గురైనట్టు పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పెద్దాపురం డీఎస్పీ ఏజీబీ తిలక్ పరిశీలించిన అనంతరం ఆయన సూచన మేరకు హత్య కేసుగా నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. అయితే సత్తిబాబు రాజానగరం వెళ్లాడా లేక వెళ్లకుండానే మధ్యలో హత్యకు గురయ్యాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహం స్థితిని గమనిస్తే ఎక్కడో హత్య చేసి ఇక్కడకు తీసుకువచ్చి పడేసినట్టు అనుమానిస్తున్నారు.
బి ప్లానింగ్‌లో శ్రీ షిర్డీసాయి విద్యార్థికి మొదటి ర్యాంకు
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): జేఈఈ మెయిన్స్ బి.ప్లానింగ్ ఫలితాల్లో రాజమహేంద్రవరం శ్రీ షిర్డీ సాయి జునియర్ కాలేజ్ విద్యార్థులు వివిధ కేటగిరీలలో జాతీయ స్థాయి అత్యుత్తమ ర్యాంకులు సాధించినట్లు విద్యా సంస్థల డైరెక్టర్ టి.శ్రీవిద్య బుధవారం తెలిపారు. తమ లక్ష్య ఐఐటీ అకాడమీలో శిక్షణ పొందుతున్న బీఏవీ విజయ భార్గవ్ ప్రధమ ర్యాంకు సాధించాడన్నారు. బి.నిహాంత్ 52, ఎ.లోహిత్ కుమార్ 53వ ర్యాంకు సాధించగా, 100 లోపు ర్యాంకులు ముగ్గురు సాధించారన్నారు. బీఆర్క్‌లో బీఏవీ విజయ భార్గవ్ ఆల్ ఇండియా 4వ ర్యాంకు, లోహిత్ కుమార్ 60వ ర్యాంకు సాధించారన్నారు. శ్రీ షిర్డీసాయి విద్యాసంస్థల చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్ మాట్లాడుతూ యేటా తమ విద్యార్థులు బిఆర్క్ బి. ప్లానింగ్ వంటి విభాగాలలో కూడా అత్యుత్తమ ర్యాంకులు సాధించడం హర్షణీయమన్నారు. విజేతలను, అందుకు కృషి చేసిన అధ్యాపక బృందాన్ని చైర్మన్ శ్రీధర్, లక్ష్య డీన్ చంద్రశేఖర్ అభినందించారు.


