పాలిసెట్‌లో జిల్లాకు 1, 8 ర్యాంకులు | - | Sakshi
Sakshi News home page

పాలిసెట్‌లో జిల్లాకు 1, 8 ర్యాంకులు

May 6 2026 8:01 AM | Updated on May 6 2026 8:01 AM

రాజమహేంద్రవరం రూరల్‌: పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశానికి గత నెల 25న నిర్వహించిన పాలిసెట్‌ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ ప్రవేశ పరీక్షలో రాజమహేంద్రవరం నగరానికి చెందిన దామోడ రామ్‌గౌతమ్‌ 120కి 120 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించాడు. గౌతమ్‌ తండ్రి సత్యనారాయణ ప్రైవేటు ఉద్యోగి. తల్లి రత్నకుమారి గృహిణి. ఇంటర్‌ చదివి జేఈఈ అడ్వాన్స్‌లో అత్యుత్తమ ర్యాంకు సాధించి ప్రముఖ ఐఐటీలో చదివి, ఇంజినీర్‌ కావాలన్నదే తన లక్ష్యమని గౌతమ్‌ చెప్పాడు. కాగా, ఈ పరీక్షలో జిల్లాకు చెందిన దిరిసాల నాగ సత్య హిమసూర్య కూడా 120కి 120 మార్కులు సాధించి, రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంకు సాధించాడు. బొమ్మూరులోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జీఎంఆర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌, పాలిసెట్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ అక్కుల మురళి ఈ విషయం తెలిపారు. పాలిసెట్‌లో జిల్లాలోని విద్యార్థులు 92.80 శాతం మంది అర్హత సాధించారని ఆయన పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా 5,668 మంది ఈ పరీక్షకు హాజరవగా, వీరిలో 5,269 మంది అర్హత సాధించారని వివరించారు.

ఈ ‘బాబు’ వద్దు బాబూ..

రాజమహేంద్రవరం సిటీ: రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ అహ్మద్‌ బాబును తక్షణమే ఆ పదవి నుంచి బదిలీ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పి.గిరి ప్రసాద్‌ వర్మ డిమాండ్‌ చేశారు. హైకోర్టు తీర్పును గౌరవించి, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. దానవాయిపేటలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం వద్ద ఉద్యోగులు భోజన విరామ సమయంలో మంగళవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా గిరి ప్రసాద్‌ వర్మ మాట్లాడుతూ, అహ్మద్‌ బాబు అనుసరిస్తున్న అక్రమ విధానాలపై సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పు.. దుర్మార్గంగా వ్యవహరించే అధికారులకు చెంపపెట్టు అని అన్నారు. ఆందోళనకు అధ్యక్షత వహించిన వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు త్వరగా శ్రీరామ్‌ మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యలు తీరే వరకు, అహ్మద్‌ బాబు బదిలీ అయ్యే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అహ్మద్‌ షరీఫ్‌, కార్యదర్శి రత్న కుమార్‌, కోశాధికారి స్వామి వెంకటేష్‌, పెన్షనర్స్‌ విభాగం నాయకుడు ఉదయ భాస్కర్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

10 రోజులైనా

ధాన్యం డబ్బులివ్వరేం?

వేగేశ్వరపురంలో రైతుల ఆందోళన

తాళ్లపూడి: కూటమి ప్రభుత్వం గొప్పగా చెబుతున్నట్టు మిల్లుకు తోలిన 24 గంటల్లో తమకు ధాన్యం సొమ్ము చెల్లించడం లేదని, 10 రోజులైనా డబ్బులెందుకివ్వడం లేదని పలువురు రైతులు ప్రశ్నించారు. వివరాలివీ.. తాళ్లపూడి మండలం వేగేశ్వరపురానికి చెందిన రైతులు గత నెల 24న మిల్లుకు రబీ ధాన్యం తోలారు. వాటికి సంబంధించిన డబ్బు ఇప్పటి వరకూ తమ ఖాతాల్లో జమ కాలేదని రైతులు తైలం ప్రసాద్‌, తైలం సంపతిరావు, నున్న కృష్ణ, సులా పోసియ్య, పెట్టా సుబ్బారావు, ఇండుగుల బుజ్జి తదితరులు పేర్కొన్నారు. ప్రభుత్వం ఒక్క రోజులోనే డబ్బు చెల్లిస్తామని ప్రకటిస్తూంటే, 10 రోజులైనా చెల్లించడం లేదని అన్నారు. రైతు సేవా కేంద్రం (ఆర్‌ఎస్‌కే) వద్దకు వెళ్లి, కంప్యూటర్‌లో చేయించుకుంటే డబ్బులొచ్చేస్తాయని రైస్‌ మిల్లర్‌ చెబుతున్నారని చెప్పారు. ఆర్‌ఎస్‌కేకి వెళ్తే రైస్‌ మిల్లుకు బ్యాంకు గ్యారెంటీ(బీజీ)లు లేవని, ఈ రోజు టార్గెట్‌ పూర్తయిపోయిందని, సర్వర్‌ పని చేయటం లేదని అక్కడి సిబ్బంది అంటున్నారని, రైతు గోడు ఎవ్వరూ వినటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మండల వ్యవసాయాధికారి రుచిత మాట్లాడుతూ, వేగేశ్వరపురం ఆర్‌ఎస్‌కేలోని పరిస్థితిపై ఆరా తీస్తానని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement